సెమీస్‌లో సబలెంకా | Sabalenka in French Open semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సబలెంకా

Jun 4 2025 3:33 AM | Updated on Jun 4 2025 3:33 AM

Sabalenka in French Open semis

క్వార్టర్‌ ఫైనల్లో ఎనిమిదో సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్‌పై గెలుపు

ఫైనల్లో చోటు కోసం స్వియాటెక్‌తో పోరు  

పారిస్‌: కెరీర్‌లో నాలుగో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ దిశగా ప్రపంచ నంబర్‌వన్, బెలారస్‌ స్టార్‌ సబలెంకా మరో అడుగు ముందుకు వేసింది. టెన్నిస్‌ సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టాప్‌ సీడ్‌ సబలెంకా రెండోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్, ఎనిమిదో సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సబలెంకా 7–6 (7/3), 6–3తో గెలుపొందింది. 1 గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకాకు గట్టిపోటీ ఎదురైంది. 

తొలి సెట్‌లో ఒకదశలో సబలెంకా 2–4తో వెనుకబడింది. అయితే ఏడో గేమ్‌లో కిన్‌వెన్‌ తడబడి అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. కిన్‌వెన్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన సబలెంకా ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 4–4తో సమం చేసింది. అనంతరం ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో నిలిచింది. టైబ్రేక్‌లో సబలెంకా జోరు కనబరిచి సెట్‌ను సొంతం చేసుకుంది. 

రెండో సెట్‌లో సబలెంకా ఏడో గేమ్‌లో, తొమ్మిదో గేమ్‌లో కిన్‌వెన్‌ సర్వీస్‌లను బ్రేక్‌ చేసి అదే జోరులో విజయాన్ని ఖరారు చేసుకుంది. మ్యాచ్‌ మొత్తంలో సబలెంకా ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 20 విన్నర్స్‌ కొట్టిన ఈ బెలారస్‌ స్టార్‌ 18 అనవసర తప్పిదాలు చేసింది. నెట్‌ వద్దకు 14 సార్లు దూసుకొచ్చి ఎనిమిది సార్లు పాయింట్లు గెలిచింది. మరోవైపు కిన్‌వెన్‌ ఐదు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 22 విన్నర్స్‌ కొట్టిన ఈ చైనా స్టార్‌ 31 అనవసరతప్పిదాలు చేసింది. 

సెమీఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌)తో సబలెంకా తలపడుతుంది. మరో క్వార్టర్‌ ఫైనల్లో స్వియాటెక్‌ 6–1, 7–5తో 13వ సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌)పై విజయం సాధించింది. 1 గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్‌ మూడు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో స్వియాటెక్‌కిది వరుసగా 26వ విజయం. 2022, 2023, 2024లలో విజేతగా నిలిచిన స్వియాటెక్‌ టైటిల్‌ నిలబెట్టుకోవడానికి రెండు విజయాల దూరంలో ఉంది.  

సెమీస్‌లో ముసెట్టి 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఎనిమిదో సీడ్‌ లొరెంజో ముసెట్టి (ఇటలీ) సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ) క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వార్టర్‌ ఫైనల్లో ముసెట్టి 6–2, 4–6, 7–5, 6–2తో 15వ సీడ్‌ టియాఫో (అమెరికా)పై గెలుపొందాడు. 

2 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముసెట్టి ఎనిమిది ఏస్‌లు సంధించాడు. తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. సోమవారం అర్ధరాత్రి తర్వాత ముగిసిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సినెర్‌ 6–1, 6–3, 6–4తో 17వ సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)పై విజయం సాధించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement