T20 WC 2022: 'బుమ్రా స్థానంలో అతడికి అవకాశమివ్వండి'

Saba Karim backs Mohammed Shami as replacement Jasprit Bumrah - Sakshi

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌-2022కు టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ మెగా ఈవెంట్‌లో భారత బౌలింగ్‌ విభాగాన్ని నడిపించే సీనియర్‌ పేసర్‌ ఎవరూ కనిపించడం లేదు. జట్టులో వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఉన్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో దారుణంగా విఫలమవుతున్నాడు. ఆరంభ ఓవర్లలో భువీ పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. అఖరి ఓవర్లలో మాత్రం పూర్తిగా తేలిపోతున్నాడు.

ఇక ఇది ఇలా ఉండగా.. ఈ ఐసీసీ మెగా ఈవెంట్‌లో బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే సత్తా సీనియర్‌ పేసర్‌ మహమ్మద్ షమీకి ఉందని భారత మాజీ క్రికెటర్‌ సబా కరీమ్ అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రాధాన జట్టులో షమీకి చోటు దక్కలేదు. అతడిని ఈ పొట్టి ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే జట్టు ప్రకటించినప్పటి నుంచే షమీని ప్రధాన జట్టులోకి తీసుకోవాలని మాజీలు, క్రికెట్‌ నిపుణులు సూచిస్తున్నారు .

స్పోర్ట్స్‌ 18తో కరీం మాట్లాడూతూ.. "మహ్మద్‌ షమీ అద్భుతమైన పేస్‌ బౌలర్‌. అతడికి టీ20 ఫార్మాట్‌లో కొత్త బంతితో వికెట్లు తీసే సత్తా ఉంది. అదే విధంగా డెత్‌ ఓవర్లలో కూడా షమీ పరుగులు కట్టడి చేయగలడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా అతడు అద్భుతంగా రాణించాడు. ఈ సమయంలో అతడి సేవలు భారత జట్టుకు చాలా అవసరం.

ఒక వేళ అతడిని టీ20 ప్రపంచకప్‌ ప్రధాన జట్టులోకి తీసుకోకపోతే భారత బౌలింగ్‌ విభాగం మరింత క్షీణిస్తుంది. జట్టు ప్రధాన బౌలర్‌ బుమ్రా దూరం కావడం భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ. అయితే అతడి స్థానాన్ని భర్తీ చేయాలంటే అనుభవం ఉన్న షమీ జట్టులోకి రావల్సిందే. జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఇదే ఆలోచనలో ఉంటారని నేను భావిస్తున్నాను.

షమీ గత కొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికి.. తన రిథమ్‌ను మాత్రం కోల్పోడు. గతంలో కూడా చాలా సార్లు జట్టుకు అతడు దూరమయ్యాడు. అయితే అతడు తిరిగి వచ్చి అద్భుతమైన ప్రదర్శన చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి" అని పేర్కొన్నాడు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో రెండో టీ20.. గౌహతికి చేరుకున్న టీమిండియా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top