విధ్వంసం సృష్టించిన జోస్‌ బట్లర్‌.. కొనసాగుతున్న రాయల్స్‌ జైత్రయాత్ర

SA20 2024: Jos Buttler Leads Royals Unbeaten Run - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో పార్ల్‌ రాయల్స్‌ జైత్రయాత్ర కొనసాగుతుంది. జోబర్గ్‌ సూపర్‌ కింగ్స్‌తో నిన్న (జనవరి 17) జరిగిన మ్యాచ్‌లో రాయల్స్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 37 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సూపర్‌ కింగ్స్‌.. లుంగి ఎంగిడి (3/17), ఓబెద్‌ మెక్‌కాయ్‌ (2/31) ధాటికి 19.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. డు ప్లూయ్‌ (71) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడకపోయుంటే సూపర్‌ కింగ్స్‌ ఈ మాత్రం స్కోరైనా చేసుండేది కాదు. రీజా హెండ్రిక్స్‌ (8), డుప్లెసిస్‌ (10), మొయిన్‌ అలీ (18), డొనొవన్‌ ఫెరియెరా (5), రొమారియో షెపర్డ్‌ (0) నిరాశపరిచారు. 

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. బట్లర్‌తో పాటు విహాన్‌ లుబ్బే (39) రాణించడంతో 14.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్‌ రాయ్‌ (5), డేవిడ్‌ మిల్లర్‌ (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో లిజాడ్‌ విలియమ్స్‌, మొయిన్‌ అలీ, ఇమ్రాన్‌ తాహిర్‌ తలో వికెట్‌ పడగొట్టారు. సూపర్‌ కింగ్స్‌పై విజయంతో రాయల్స్‌ ఈ సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top