ఖాళీ మైదానాలతో తీవ్రత తగ్గదు! 

Royal Challengers Bangalore Captain Virat Kohli Speaks About His Team - Sakshi

ప్రేక్షకులు లేని మ్యాచ్‌లపై కోహ్లి వ్యాఖ్య 

దుబాయ్‌: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆటగాళ్లు బయో బబుల్‌కు అలవాటు పడిపోయారని ఆ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పాడు. ఖాళీ స్టేడియాల్లో ఈవెంట్‌ జరుగుతున్నంత మాత్రాన మ్యాచ్‌ల్లోని తీవ్రత, ఉత్కంఠ ఏ మాత్రం తగ్గవని చెప్పాడు. ‘ఇది మాకు కొత్త అనుభవమే. కానీ మ్యాచ్‌ స్థాయి, పోటీ తగ్గనే తగ్గదు’ అని అన్నాడు. గత నెల 21న యూఏఈ చేరుకున్న కోహ్లి బృందం రెండు వారాలుగా ప్రాక్టీస్‌లో చెమటోడ్చుతుంది. రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు కూడా ఆడింది. ప్రేక్షకులు లేని ఆటకూ ఎంచక్కా అలవాటు పడిపోయింది. ‘బయో బబుల్‌తో ఎలా నెట్టుకు రావాలని ఆలోచించిన ఆటగాళ్లంతా ఇప్పుడు తేలిక పడ్డారు. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా... ఇప్పుడైతే అంతా చక్కగా అలవాటు పడిపోయారు. మా వాళ్లకు బుడగతో ఇప్పుడే ఇబ్బంది లేదు. ఒకవేళ ఈ బబుల్‌కు అలవాటు పడకపోయి వుంటే కచ్చితంగా మేమంతా విచారంగానే, ఏదో మాయలో ఉన్నట్లే ఉండేవాళ్లం’ అని కోహ్లి తెలిపాడు. 

కరోనా యోధుల గౌరవార్థం... 
ఆర్‌సీబీ జట్టు కరోనా యోధుల గౌరవార్థం తమ జెర్సీలపై ‘మై కోవిడ్‌ హీరోస్‌’ అనే నినాదంతో ఈ సీజన్‌లో బరిలోకి దిగనుంది. దీనికి సంబంధించిన ఫొటోను విరాట్‌ కోహ్లి సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. వర్చువల్‌ మీటింగ్‌లో ఈ జెర్సీలను ఆవిష్కరించారు. ఆర్‌సీబీ చైర్మన్‌ సంజీవ్‌ చురివాలా, కెప్టెన్‌ కోహ్లి, ఆటగాళ్లు పార్థివ్‌ పటేల్, దేవదత్‌ పడిక్కల్‌ ఈ మీటింగ్‌లో  పాల్గొన్నారు. మహమ్మారిపై పోరులో ముందుండి నడిపిస్తున్న యోధులను తాము ఈ విధంగా గౌరవిస్తున్నామని ఆర్‌సీబీ తెలిపింది. అలాగే ‘గివ్‌ ఇండియా ఫౌండేషన్‌’కు తమ మద్దతిస్తున్నామని, నిధుల సేకరణ కోసం చేపట్టే వేలానికి ఆర్‌సీబీ ఆడిన తొలి మ్యాచ్‌ జెర్సీలను విరాళంగా ఇస్తామని ఆర్‌సీబీ ప్రకటించింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top