రైజింగ్‌ ‘గ్రాండ్‌’ స్టార్‌ | Ritwik plays his third consecutive Grand Slam tournament | Sakshi
Sakshi News home page

Bollipalli Rithvik Choudary: రైజింగ్‌ ‘గ్రాండ్‌’ స్టార్‌

Jul 9 2025 1:46 AM | Updated on Jul 9 2025 12:32 PM

Ritwik plays his third consecutive Grand Slam tournament

వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడిన రిత్విక్‌

వింబుల్డన్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌లో ఆకట్టుకున్న వైనం

నాలుగేళ్లుగా ఏటీపీ టూర్‌లో నిలకడగా ఫలితాలు 

డేవిస్‌కప్‌ టోర్నమెంట్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం 

24 ఏళ్లకే డబుల్స్‌ స్పెషలిస్ట్‌గా గుర్తింపు  

టెన్నిస్‌ రాకెట్‌ చేతపట్టిన ప్రతి ప్లేయర్‌ గ్రాండ్‌స్లామ్‌ ఆడాలనే కలలు కంటాడు. అందులోనూ 148 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన వింబుల్డన్‌ కోర్టులో అడుగు పెట్టాలనిఅందరికీ ఉంటుంది. కానీ దాన్ని కొందరు మాత్రమే నిజం చేసుకుంటారు. నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలలో వింబుల్డన్‌కు ఉన్న క్రేజే వేరు. నిగనిగలాడే పచ్చిక కోర్టులు... ఎంత గొప్ప ప్లేయర్లయినా తెలుపు రంగు దుస్తులతోనే ఆడాలన్న నిబంధన... దీనిని ప్రతి ఒక్కరూ పాటించడం... ఇదొక అనిర్వచనీయ అనుభూతి. 

లండన్‌లోని ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఈసారి మన హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ (Bollipalli Rithvik Choudary) బరిలోకి దిగాడు. తొలి అడ్డంకిని దాటి రెండో రౌండ్‌కు చేరిన రిత్విక్‌... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ఇప్పటి వరకు ముగ్గురు భారతీయులు మాత్రమే వింబుల్డన్‌ డబుల్స్‌ విభాగంలో విజేతలుగా నిలవగా... ఎప్పటికైనా ఇక్కడ చాంపియన్‌గా నిలవడమే తన జీవిత లక్ష్యమని రిత్విక్‌అంటున్నాడు.      – సాక్షి క్రీడావిభాగం  

అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించాలని చిన్నప్పటి నుంచి కలలు కన్న బొల్లిపల్లి రిత్విక్‌చౌదరీ కెరీర్‌లో రెండు ఏటీపీ–250 టోర్నీ డబుల్స్‌ టైటిల్స్‌ గెలిచాడు. అధిక శాతం ఆటగాళ్లు కెరీర్‌ తొలినాళ్లలో సింగిల్స్‌పై దృష్టి పెట్టి... ఇక చాలు అనుకుంటున్న దశలో డబుల్స్‌కు మారడం పరిపాటి. అయితే రిత్విక్‌మాత్రం అందుకు భిన్నంగా కెరీర్‌ ఆరంభంలోనే తన లక్ష్యాలపై స్పష్టత ఏర్పరచుకున్నాడు. తన ఆటతీరుకు డబుల్స్‌ అనుకూలంగా ఉంటుందని భావించిన రిత్విక్‌సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా 24 ఏళ్ల వయసులోనే రెండు ఏటీపీ–250 టైటిల్స్‌ అతడి ఖాతాలో చేరాయి. 

ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం ప్రపంచ 79వ ర్యాంక్‌లో ఉన్న ఈ హైదరాబాదీ... ఈ ఏడాది వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలోనూ బరిలోకి దిగి నిలకడ కనబర్చాడు. ఆ్రస్టేలియా ఓపెన్, ఫ్రెంచ్‌ ఓపెన్‌లలో తొలి రౌండ్‌లోనే వెనుదిరిగిన రిత్విక్‌ వింబుల్డన్‌లో మాత్రం రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలిసారి వింబుల్డన్‌ బరిలోకి దిగడం చాలా ఆనందంగా ఉందన్న రిత్విక్‌... దీని వెనక తన తల్లిదండ్రులు ప్రతాప్, లక్ష్మీ త్యాగాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ టోర్నమెంట్‌లో తల్లిదండ్రుల సమక్షంలో మ్యాచ్‌ నెగ్గడం మరిచిపోలేని అనుభూతి అని అన్నాడు.  

డ్యాన్సింగ్, డ్రాయింగ్‌ కాదని... 
క్రికెట్‌ను మతంలా భావించే మన దేశంలో... అందరిలాగే రిత్విక్‌కూడా పెద్దయ్యాక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌గా మారాలనుకున్నాడు. ఏక కాలంలో అనేక అంశాలపై ఆసక్తి కనబరిచే పిల్లల్లాగే రిత్విక్‌పసితనంలో అన్నీ చేస్తూ హైపర్‌ యాక్టివ్‌గా ఉండేవాడు. డ్యాన్సింగ్, డ్రాయింగ్‌ ఇలా అన్నీట్లో ముందుండేవాడు. దీంతో అతడిని ఏదైనా ఆటలో శిక్షణ ఇప్పించాలని తల్లిదండ్రులు భావించారు. క్రికెట్‌ నేర్పించాలని అనుకున్నా... రిత్విక్‌వయసు మరీ చిన్నది కావడంతో బంతితో దెబ్బలు తగులుతాయేమోననే భయంతో తల్లిదండ్రులు అతడిని ఇంటికి సమీపంలోని టెన్నిస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించారు.

సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రియేషన్‌ క్లబ్‌ మైదానం సమీపంలోని ‘ద స్కూల్‌ ఆఫ్‌ పవర్‌ టెన్నిస్‌’ సెంటర్‌లో కోచ్‌ సీవీ నాగరాజ్‌ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్‌అండర్‌–12, అండర్‌–16 స్థాయిలో జాతీయ నంబర్‌వన్‌గా నిలిచాడు. ఒలింపియన్, భారత డేవిస్‌కప్‌ జట్టు మాజీ సభ్యుడు, వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఆడిన విష్ణువర్ధన్, ఆసియా క్రీడల్లో, డేవిస్‌కప్‌లో, గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఆడిన సాకేత్‌ మైనేని కూడా ఒకప్పుడు ‘ద స్కూల్‌ ఆఫ్‌ పవర్‌ టెన్నిస్‌’ సెంటర్‌లోనే శిక్షణ తీసుకున్నారు. 

కోచ్‌ నాగరాజ్‌ వద్ద క్రమం తప్పకుండా తన ఆటకు మెరుగులు దిద్దుకున్న రిత్విక్‌ అంచలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలో ఎన్ని టెన్నిస్‌ టోర్నీలు ఉన్నా వింబుల్డన్‌ మాత్రం ప్రత్యేకమని రిత్విక్‌తల్లి లక్ష్మి వెల్లడించారు. వింబుల్డన్‌ అధికారిక వెబ్‌సైట్‌ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లక్ష్మి... రిత్విక్‌ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. స్టెఫీ గ్రాఫ్, పీట్‌ సంప్రాస్, లియాండర్‌ పేస్, మహేశ్‌ భూపతి, సానియా మీర్జా (Sania Mirza) వంటి దిగ్గజ ఆటగాళ్లు విజేతలుగా నిలిచిన చోట తమ కుమారుడు కూడా ఆడటం మాటల్లో వర్ణించలేని అనుభూతి అని ఆమె అన్నారు. 

ఆర్థిక ఇబ్బందులకు ఎదురొడ్డి... 
టెన్నిస్‌ బాగా ఖర్చుతో కూడుకున్న క్రీడ కావడంతో ఒక దశలో రిత్విక్‌ శిక్షణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే తమ కుమారుడి కెరీర్‌కన్నా తమకు ఏదీ ఎక్కువ కాదనుకున్న ఆ తల్లిదండ్రులు... రిత్విక్‌ లక్ష్యం కోసం అన్నీ వదిలేసుకున్నారు. ఎదుగుతున్న క్రమంలో అతడి ఆటతీరు ఆ నమ్మకాన్నివ్వగా... ఒక్కసారి ప్రొఫెషనల్‌ కెరీర్‌ ప్రారంభించాక ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. 

‘వింబుల్డన్‌ ఆడుతున్నానని తెలిసినప్పుడు నా కన్నా మా అమ్మానాన్నే ఎక్కువగా సంతోషించారు. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఆడాలని ఎన్నో కలలు కన్నా. ఇప్పటికి అది సాధ్యపడింది. దీని వెనక మా కుటుంబం మొత్తం కృషి ఉంది. ఈ విజయం నా ఒక్కడిది కాదు ఇందులో మా అమ్మ, నాన్న, అమ్మమ్మ పాత్ర ఎంతో ఉంది’ అని తొలి రౌండ్‌ విజయానంతరం రిత్విక్‌అన్నాడు. కొలంబియాకు చెందిన నికోలస్‌ బరియెంటోస్‌తో కలిసి పురుషుల డబుల్స్‌ బరిలోకి దిగిన రిత్విక్‌... రెండో రౌండ్‌లో ఆరో సీడ్‌ జోడీ జో సాలిస్‌బరీ–నీల్‌ స్కప్‌స్కీ (బ్రిటన్‌) చేతిలో పోరాడి ఓడిపోయారు.  

రిత్విక్‌వింబుల్డన్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించడంతో... చిన్నప్పటి నుంచి కన్న కల నిజమైనట్లు అనిపించింది. ప్రపంచంలో ఎన్ని టోర్నమెంట్‌లు ఉన్నా... వింబుల్డన్‌ అంటే వింబుల్డనే. ఆటలో హుందాతనానికి ఇది గొప్ప నిదర్శనం. ప్రపంచంలోని అత్యుత్తమ టోర్నీలో రిత్విక్‌ ఆడతాడని కలలో కూడా ఊహించలేదు. అందుకే లండన్‌లో అడుగు పెట్టిన మూడు రోజుల తర్వాత కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. సంప్రాస్, స్టెఫీ గ్రాఫ్‌ వంటి దిగ్గజాలు ఆడిన చోట రిత్విక్‌ బరిలోకి దిగడం నాకెంతో గర్వంగా ఉంది. – లక్ష్మి, రిత్విక్‌తల్లి  

రిత్విక్‌ప్రొఫైల్‌
పుట్టిన తేదీ, స్థలం: 17–1–2001; హైదరాబాద్‌ 
ఎత్తు: 6 అడుగుల 2 అంగుళాలు 
బరువు: 85 కేజీలు 
ప్రొఫెషనల్‌గా మారిన ఏడాది: 2022 
డబుల్స్‌లో కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌: 65 (మార్చి;2025లో) 
ఏటీపీ టూర్‌లో నెగ్గిన డబుల్స్‌ టైటిల్స్‌: 2 (అల్మాటీ ఓపెన్‌–250 టోర్నీ; చిలీ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీ) 
ఏటీపీ చాలెంజర్‌ టూర్‌ టైటిల్స్‌:
ఐటీఎఫ్‌ సర్క్యూట్‌లో నెగ్గిన టైటిల్స్‌:

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement