Yuvraj Singh: టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీకి అతడే సరైనోడు..!

Rishabh Pant Should Be Made Team India Test Captain Says Yuvraj Singh - Sakshi

టీమిండియా భవిష్యత్తు టెస్ట్‌ కెప్టెన్ ఎవరనే అంశంపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ స్థానానికి రిషబ్ పంత్‌ సరైనోడని అభిప్రాయపడ్డాడు. వయసు పైబడిన రిత్యా రోహిత్‌ శర్మ ఎక్కువ కాలం టెస్ట్‌ కెప్టెన్‌గా కొనసాగలేడని, అందుకే ఇప్పటి నుంచే పంత్‌కు టెస్ట్‌ జట్టు ఉప సారధ్య బాధ్యతలు అప్పజెప్పి తీర్చిదిద్దాలని భారత సెలక్టర్లకు సూచించాడు. కొత్తగా ప్రారంభించిన ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్‌ ఈమేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. 

వికెట్‌కీపర్‌ కావడం, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను అద్భుతంగా ముందుండి నడిపించడం వంటి పలు అర్హతలను కొలమానంగా తీసుకుని పంత్‌ను భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయాలని యువీ కోరాడు. వికెట్‌కీపర్లు వికెట్ల వెనకాల ఉన్నా జట్టును అద్భుతంగా ముందుండి నడిపించగలరని, మైదానంలో ఉత్తమ వీక్షకులు వారేనని, ఇందుకు ధోని సరైన ఉదాహరణ అని, పంత్‌లో కూడా ధోని లక్షణాలు చాలానే ఉన్నాయని పంత్‌ను ఆకాశానకెత్తాడు. 

అయితే, పంత్‌కు సారధ్య బాధ్యతలు అప్పజెప్పిన వెంటనే అద్భుతాలు ఆశించకూడదని, అతనికి ఓ ఏడాది పాటు సమయం ఇవ్వాలని, ఈ విషయంలో బీసీసీఐ పంత్‌కు అండగా ఉండాలని సూచించాడు. టీమిండియా కెప్టెన్సీ చేపట్టేంత పరిపక్వత పంత్‌కు ఉందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. క్రికెట్‌ చరిత్రలో సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్లంతా ఆరంభంలో ఇబ్బంది పడ్డవారేనని, పంత్‌ కూడా కాలంతో పాటే పరిణితి చెందుతాడని వత్తాసు పలికాడు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో విరాట్‌ కోహ్లి టీమిండియా టెస్ట్‌ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్న తదనంతర పరిణామాల్లో రోహిత్‌ శర్మ భారత జట్టు ఫుల్‌ టైమ్‌ సారధిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 
చదవండి: గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్‌.. కోచ్‌ పదవి నుంచి తప్పుకోనున్న కిర్‌స్టన్‌..!

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top