ఐపీఎల్-2026లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఆదివారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.
ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ(46), యశస్వి జైశ్వాల్(39) తొలి వికెట్‌కు 81 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రం దారుణంగా విఫలమయ్యారు. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎట్టుకేలకు తన రిథమ్‌ను అందుకున్నాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో వరుణ్ కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు కార్తీక్ త్యాగి మూడు, సునీల్ నరైన్ రెండు వికెట్లు సాధించాడు.
గెలిపించిన రింకూ, అనుకుల్
అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్లు టిమ్ సీఫర్ట్, రహానే ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత గ్రీన్(27) కాస్త దూకుడుగా ఆడి రాజస్తాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేశాడు.
దూకుడుగా ఆడిన గ్రీన్ కూడా బిష్ణోయ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. వెంటనే రఘువంశీ కూడా ఔటయ్యాడు. ఈ క్రమంలో రింకూ సింగ్, పావెల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పావెల్(23) కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రమణ్‌దీప్(10) ప్రభావం చూపలేకపోయాడు.
దీంతో కేకేఆర్‌కు మరో ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ రింకూ సింగ్(53 నాటౌట్), అనుకుల్ రాయ్(29 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడి తమ జట్టుకు తొలి విజయాన్ని అందించారు. ఫలితంగా 156 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.


