BBL Vs ILT 20: ఆటగాళ్లకు కోట్లలో ఆఫర్‌.. సొంత లీగ్‌కు తూట్లు పొడిచే యత్నం!

Report:15 Australian Players Offers Huge Amount Skip BBL For-UAE League - Sakshi

క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్వహించే బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌)కు ఆటగాళ్లు తూట్లు పొడిచే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది యూఏఈ వేదికగా జనవరిలో ఇంటర్నేషనల్‌ లీగ్‌(ఐఎల్‌టీ 20) ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో కోట్ల రూపాయలు కుమ్మరించి స్టార్‌ ఆటగాళ్లను ఆడించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడే 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐఎల్‌టీలో ఆడేందుకు భారీ ఆఫర్‌ ఇచ్చినట్లు సమాచారం.

రిపోర్ట్స్‌ ప్రకారం 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారత కరెన్సీలో దాదాపు రూ.30 కోట్లు ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రతీఏటా బీబీఎల్‌ డిసెంబర్‌లో​ మొదలై.. ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఇక ఈ ఏడాది డిసెంబర్‌ 13న మొదలుకానున్న బీబీఎల్‌ ఫిబ్రవరి 4 వరకు జరగనుంది.ఇదే సమయంలో ఇంటర్నేషనల్‌ లీగ్‌ టి20(ఐఎల్‌టీ 20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు మొదటి ఎడిషన్‌ జరగనుంది.

మొత్తం ఆరుజట్లు ఉండగా.. ఈ జట్లను దాదాపు ఐపీఎల్‌తో సంబంధమున్న సంస్థలే కొనుగోలు చేయడం విశేషం. యూఏఈ వేదికగా జరుగుతున్న తొలి సీజన్‌ను విజయవంత చేసేందుకు స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని అన్ని జట్లు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడుతున్న 15 మంది  ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లకు బీబీఎల్‌ వదిలేసి.. ఐఎల్‌టీ లీగ్‌లో పాల్గొనేందుకు భారీ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

యూఏఈ టి20 లీగ్‌లో ఒక్కో టీమ్‌కి 2.5 మిలియన్ డాలర్లు (రూ.20 కోట్లు) పర్సు వాల్యూని కేటాయించారు. దీంతో స్టార్ ప్లేయర్లను 450000 డాలర్లు (దాదాపు 3.5 కోట్లు) ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐపీఎల్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ మిగిలిన క్రికెట్ లీగులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. పొరుగుదేశం పాక్‌లో పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో అత్యధికంగా చెల్లించే మొత్తం రూ.1.9 కోట్లు మాత్రమే... ఐపీఎల్ తర్వాత అత్యంత పాపులారిటీ దక్కించుకున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్‌)లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు.

దీంతో యూఏఈ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్లు, బిగ్‌బాష్ లీగ్ ఆడకుండా అదే సమయంలో యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు 15 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు రూ.4 కోట్ల దాకా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆశచూపిస్తున్నారని సమాచారం. రూ.4 కోట్లంటే ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ రిజర్వు ప్లేయర్‌కి ఇచ్చే మొత్తం. అయితే బీబీఎల్ ద్వారా వచ్చే దానితో పోల్చుకుంటే, ఆసీస్ క్రికెటర్లకు ఇది చాలా ఎక్కువ మొత్తమే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాకి భయం పట్టుకుంది. అయితే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే అనుమతి తప్పనిసరి. కానీ బిగ్‌బాష్‌ లీగ్‌లో ఆటగాళ్లకు అలాంటి అవసరం లేదు. లీగ్‌లో ఆడాలా వద్దా అనేది ఆటగాళ్ల నిర్ణయానికే వదిలేస్తుంది అక్కడి సీఏ(క్రికెట్‌ ఆస్ట్రేలియా).

అందుకే 2014 నుంచి ఆసీస్‌ స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇప్పటివరకు బీబీఎల్‌ ఆడింది లేదు. వార్నర్‌ ఒక్కడే కాదు.. చాలా మంది ఆసీస్‌ క్రికెటర్లు బీబీఎల్‌ను మధ్యలోనే వదిలేసి వేరే లీగ్‌ ఆడేందుకు వెళ్లిపోతుంటారు. ఆసీస్ క్రికెటర్లు ఆ డబ్బుకి ఆశపడి యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకుంటే, స్టార్ ప్లేయర్లు లేకుండా బీబీఎల్‌ని నిర్వహించాల్సి ఉంటుంది. మిగిలిన దేశాల ప్లేయర్లు కూడా యూఏఈ టీ20 లీగ్‌ ఆడేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తే బీబీఎల్‌ నిర్వహణే కష్టమైపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోందట ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బీసీసీఐ మాదిరిగానే తమ ప్లేయర్లు, విదేశీ టీ20ల్లో లీగుల్లో పాల్గొనకుండా నియంత్రించాలనే ఆలోచనలో కూడా సమాచారం.

ఇక ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి యూఏఈ నుంచి 7 లక్షల డాలర్లు (దాదాపు 5.5 కోట్లు) ఆఫర్ వచ్చిందని, అలాగే ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి కూడా దాదాపు రూ.6 లక్షల డాలర్లకు పైగా ఆఫర్ వచ్చందని... ఈ ఇద్దరూ యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాని అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. 

చదవండి: NED vs NZ: పసికూనపై కివీస్‌ ప్రతాపం.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్‌ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top