ఆర్సీబీ కెప్టెన్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ ఫిప్టీ? | RCB captain Rajat Patidar slams his fastest IPL fifty, | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీ కెప్టెన్‌ విధ్వంసం.. ఫాస్టెస్ట్‌ ఫిప్టీ?

Apr 12 2026 10:21 PM | Updated on Apr 12 2026 10:21 PM

RCB captain Rajat Patidar slams his fastest IPL fifty,

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ తన భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాటిదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు ముంబై బౌలర్లను ఉతికారేశాడు. 

కేవలం 17 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసి ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఐపీఎల్‌లో పాటిదార్‌కు ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మొత్తంగా  20 బంతులు ఎదుర్కొన్న పాటిదార్‌.. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో పాటిదార్ ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్ధానానికి దూసుకెళ్లాడు.  పాటిదార్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌ల్లో 65 సగటుతో 195 పరుగులు చేశాడు. 

అతడి స్ట్రైక్ రేట్(214.29) జట్టులోని ఇతర విధ్వంసకర బ్యాటర్లైన టిమ్ డేవిడ్, దేవదత్ పడిక్కల్,  ఫిల్ సాల్ట్ కంటే మెరుగ్గా ఉండటం విశేషం. అదేవిధంగా ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ చేసిన కెప్టెన్‌గా ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ రికార్డును సమం చేశాడు. 2009 సీజన్‌లో డక్కన్‌ ఛార్జర్స్‌ కెప్టెన్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ కూడా 17 బంతుల్లో ఆర్ధశతకం సాధించాడు. ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత గిల్లీ రికార్డును పాటిదార్‌ సమం చేశాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. పాటిదార్‌తో పాటు ఫిల్ సాల్ట్‌ (36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), విరాట్‌ కోహ్లి(53), డేవిడ్‌(34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ముంబై బౌలర్లలో బౌల్ట్‌, హార్దిక్‌ పాండ్యా, శాంట్నర్‌, ఠాకూర్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement