
PC: X
పహల్గామ్ ఉగ్రదాడికి బదులిచ్చేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగుతోంది. మంగళవారం అర్ధరాత్రి తర్వాత భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మెరుపు దాడులు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి.
ఇందుకు బదులుగా పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడటంతో పాటు.. మిసైళ్లతో దాడికి దిగింది. ఇందుకు భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. యాంటీ మిసైల్ స్టిసమ్‌తో గాల్లోనే పాక్ క్షిపణులను పేల్చివేసింది. ఇందులో భాగంగా లాహోర్, రావల్పిండిలోని పాక్ సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు సమాచారం.
రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో
ఈ క్రమంలో రావల్పిండి క్రికెట్ స్టేడియం సమీపంలో భారత్ డ్రోన్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. మైదానానికి దగ్గర్లోనే దాడి జరిగినట్లు సమాచారం. కాగా ఇక్కడే గురువారం రాత్రి పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) మ్యాచ్ జరగాల్సి ఉంది. బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్సీలోని పెషావర్ జల్మీ- డేవిడ్ వార్నర్ సారథ్యంలోని కరాచీ కింగ్స్ మధ్య మ్యాచ్ నిర్వహించేందుకు పాక్ క్రికెట్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది.
అయితే, స్టేడియానికి దగ్గర్లోనే డ్రోన్ దాడి జరగడంతో అప్రమత్తమైన పాక్ బోర్డు.. క్రికెటర్లు రావల్పిండి విడిచి వెళ్లిపోవాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్‌కు చెందిన ఓ జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
డ్రోన్ దాడి నేపథ్యంలో అత్యవసరంగా సమావేశమైన పీసీబీ అధికారులు పీఎస్‌ఎల్ కొనసాగింపు , వేదికల మార్పు తదితర అంశాల గరించి చర్చినట్లు తెలుస్తోంది. కాగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన పలువురు క్రికెటర్లు ప్రస్తుతం పాక్‌లోనే ఉన్నారు.
కరాచీలో
మరోవైపు.. భారత్- పాక్ పరస్పర దాడుల నేపథ్యంలో తమ పౌరులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అమెరికా చెప్పడం పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతోంది.ఇలాంటి సమయంలో పాక్ టీ20 లీగ్ కొనసాగకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు.. రావల్పిండిలో ఈరోజు జరగాల్సిన మ్యాచ్‌ను కరాచీకి తరలించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకు న్న పాక్.. ఇటీవలే భారీగా డబ్బు ఖర్చు పెట్టి స్టేడియాలను పునరుద్ధరించింది.