Mayank Agarwal: సునాయాసంగా డబుల్‌ సెంచరీలు బాదేస్తున్న టీమిండియా ఓపెనర్లు.. గిల్‌ తర్వాత మరొకరు

Ranji Trophy 2022 23: Mayank Agarwal Scored Double Hundred Against Kerala - Sakshi

Ranji Trophy 2022-23 KAR VS KER: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా కేరళతో జరిగిన ఎలైట్‌ గ్రూప్‌-సి మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (208; 17 ఫోర్లు, 5 సిక్సర్‌) డబుల్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. మయాంక్‌కు జతగా నికిన్‌ జోస్‌ (54), శరత్‌ (53), శుభంగ్‌ హేగ్డే (50 నాటౌట్‌) అర్ధసెంచరీలతో రాణించడంతో కర్ణాటక 485/9 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన కేరళ సచిన్‌ బేబీ (141) సెంచరీతో అదరగొట్టడంతో తొలి ఇన్నింగ్స్‌లో  342 పరుగులకు ఆలౌటైంది. కేరళ స్కోర్‌ రెండో ఇన్నింగ్స్‌లో 96/4 వద్ద ఉండగా.. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు. 

సునాయాసంగా డబుల్‌ సెంచరీలు..
ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు ఫార్మాట్లకతీతంగా డబుల్‌ సెంచరీలు బాదేస్తున్న విషయం విధితమే. రెండు రోజుల కిందట హైదరాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీతో (208) విధ్వంసం సృష్టించగా.. తాజాగా మరో టీమిండియా ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (208) రంజీల్లో ఈ ఫీట్‌ సాధించాడు. మయాంక్‌ టెస్ట్‌ల్లోనూ భారత్‌ తరఫున డబుల్‌ సెంచరీ (243) చేశాడు.

కాగా, ప్రస్తుత రంజీ సీజన్‌లో మయాంక్‌తో పాటు టీమిండియా ఆటగాళ్లు పృథ్వీ షా, కేదార్‌ జాదవ్‌, మనన్‌ వోహ్రా, పునిత్‌ బిస్త్‌, మహ్మద్‌ సైఫ్‌, తరువార్‌ కోహ్లి డబుల్‌ సెంచరీలతో విరుచుకుపడ్డారు. వీరిలో పృథ్వీ షా ఏకంగా ట్రిపుల్‌ సెంచరీ (379) చేశాడు. గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ బంగ్లాదేశ్‌పై 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు.

తాజాగా గిల్‌ చేసిన ద్విశతకంతో అంతర్జాతీయ వన్డేల్లో డబుల్‌ సెంచరీల సంఖ్య 10​కి చేరింది. ఈ 10లో 7 భారత ఆటగాళ్లు చేసినవే కాగా, ఈ ఫీట్‌ సాధించిన వారంతా ఓపెనర్లే కావడం విశేషం.

వన్డేల్లో డబుల్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల వివరాలు..
సచిన్‌ టెండూల్కర్‌ (2010లో సౌతాఫ్రికాపై 200 నాటౌట్‌),
వీరేంద్ర సెహ్వాగ్‌ (2011లో వెస్టిండీస్‌పై 219), 
రోహిత్ శర్మ (2013లో ఆసీస్‌పై 209), 
రోహిత్‌ శర్మ (2014లో శ్రీలంకపై 264), 
క్రిస్‌ గేల్‌ (2015లో జింబాబ్వేపై 215), 
మార్టిన్‌ గప్తిల్‌ (2015లో వెస్టిండీస్‌పై 237*), 
రోహిత్‌ శర్మ (2017లో శ్రీలంకపై 208*), 
ఫకర్‌ జమాన్‌ (2018లో జింబాబ్వేపై 210*), 
ఇషాన్‌ కిషన్‌ (2022లో బంగ్లాదేశ్‌పై 210), 
శుభ్‌మన్‌ గిల్‌ (2023లో న్యూజిలాండ్‌పై 208)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top