సంచలన విజయం.. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర | Sakshi
Sakshi News home page

R Praggnanandhaa: వరల్డ్‌ చాంపియన్‌ను ఓడించి.. విశ్వనాథన్‌ ఆనంద్‌ను దాటుకుని

Published Wed, Jan 17 2024 5:52 PM

R Praggnanandhaa Becomes Top Ranked Indian Chess Player - Sakshi

చెన్నై చెస్‌ సంచలనం ఆర్‌. ప్రజ్ఞానంద సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్‌లో తొలిసారిగా భారత టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాడు. లెజెండ్‌ విశ్వనాథన్‌ ఆనందన్‌ను దాటుకుని మరీ అగ్రస్థానానికి ఎగబా​కాడు. 

ప్రపంచ చాంపియన్‌ డింగ్‌ లిరెన్‌ను ఓడించి ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. టాటా స్టీల్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్లో భాగంగా.. చైనాకు చెందిన లిరెన్‌తో బుధవారం జరిగిన పోటీ సందర్భంగా ప్రజ్ఞానంద ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.

నంబర్‌ 1 ప్రజ్ఞానంద
ప్రస్తుత ఫిడే ర్యాంకింగ్స్‌ ప్రకారం.. ప్రజ్ఞానంద ఖాతాలో 2748.3 పాయింట్లు ఉండగా.. విశ్వనాథన్‌ ఆనంద్‌ ఖాతాలో 2748 పాయింట్లు ఉన్నాయి. ఈ క్రమంలో భారత టాప్‌ ర్యాంకర్‌గా అవతరించిన ప్రజ్ఞానంద వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 11వ స్థానంలో కొనసాగుతున్నాడు.

రెండో భారతీయ క్రీడాకారుడిగా రికార్డు
అంతేకాదు.. లిరెన్‌పై విజయం సాధించడం ద్వారా మరో రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత.. క్లాసికల్‌ చెస్‌లో వరల్డ్‌ చాంపియన్‌ను ఓడించిన భారత రెండో క్రీడాకారుడిగా చరిత్రకెక్కాడు.

సంతోషంగా ఉంది
ఈ సందర్భంగా ప్రజ్ఞానంద మాట్లాడుతూ.. బలమైన ప్రత్యర్థిని ఓడించడం అంత తేలికేమీ కాదని.. అందుకే తనకు ఈ విజయం మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. తొలిసారి వరల్డ్‌ చాంపియన్‌పై గెలుపొందడం రెట్టింపు సంతోషాన్నిస్తుందని హర్షం వ్యక్తం చేశాడు.

అదానీ, సచిన్‌ ప్రశంసలు
కాగా భారత టాప్‌ ర్యాంకర్‌గా నిలిచిన ప్రజ్ఞానందపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అగ్రశ్రేణి వ్యాపారవేత్త, అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ, భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తదితరులు ఎక్స్‌ వేదికగా ప్రజ్ఞానందను అభినందించారు. ‘‘నిన్ను చూసి దేశం గర్విస్తోంది’’ అంటూ కితాబులిచ్చారు.

చదవండి: IPL 2024: హార్దిక్‌ వెళ్లినా నష్టం లేదు.. గిల్‌ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
 
Advertisement