హార్దిక్‌ వెళ్లినా నష్టం లేదు.. గిల్‌ కూడా వెళ్లిపోతాడు: షమీ షాకింగ్‌ కామెంట్స్‌ | 'Farak Nahi Padta': Shami's Blunt Verdict On Hardik Pandya Leaving GT In IPL 2024 - Sakshi
Sakshi News home page

IPL 2024: హార్దిక్‌ వెళ్లినా నష్టం లేదు.. గిల్‌ కూడా వెళ్లిపోతాడు: షమీ కీలక వ్యాఖ్యలు

Published Wed, Jan 17 2024 2:57 PM

Farak Nahi Padta Shami Blunt Verdict On Hardik Pandya Leaving GT IPL 2024 - Sakshi

IPL 2024- Mohammed Shami's Blunt Verdict: రెండేళ్ల క్రితం క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ అరంగేట్రంలోనే విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్‌-2022 సీజన్‌లో ట్రోఫీ గెలిచి సత్తా చాటింది. టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన కెరీర్‌లో తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకు ఈ విజయాన్ని అందించాడు.

అదే విధంగా... 2023 ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేర్చి సారథిగా తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు. అయితే, ఐపీఎల్‌-2024 వేలానికి ముందే ముంబై ఇండియన్స్‌తో బేరం కుదుర్చుకుని.. అభిమానులకు ఊహించని షాకిచ్చాడు హార్దిక్‌ పాండ్యా. టైటాన్స్‌ను వీడి సొంతగూటికి వెళ్లిపోయాడు.

కొత్త సారథిగా గిల్‌
ఆరంభం నుంచి తమతోనే ఉన్నా.. కష్టకాలంలో తనను వదిలించుకున్న ఆ ఫ్రాంఛైజీతోనే మళ్లీ దోస్తీకట్టాడు. హార్దిక్‌ నిర్ణయాన్ని గౌరవించిన గుజరాత్‌ టైటాన్స్‌ ముంబై చెల్లించిన మొత్తం తీసుకుని అతడిని వదిలేసింది. తమ కొత్త కెప్టెన్‌గా టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ పేరును ప్రకటించింది.

హార్దిక్‌ వెళ్తే నష్టమేమీ లేదు
ఈ పరిణామాలపై టీమిండియా సీనియర్‌ పేసర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ కీలక బౌలర్‌ మహ్మద్‌ షమీ తాజాగా స్పందించాడు. ఈ మేరకు.. ‘‘ఎవరు జట్టును వీడి వెళ్లినా పెద్దగా ఫరక్‌ పడదు(నష్టమేమీ ఉండదన్న ఉద్దేశంలో). జట్టు సమతూకంగా ఉందా లేదా అన్నది మాత్రమే మనం చూడాల్సింది.

హార్దిక్‌ ఒకప్పుడు సారథిగా ఉన్నాడు. మమ్మల్ని విజయవంతంగా ముందుకు నడిపించాడు. రెండు ఎడిషన్లలోనూ ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. ఓ‍సారి గెలిపించాడు కూడా!

ఏదో ఒకరోజు గిల్‌ కూడా వెళ్లిపోతాడు
అయినా.. గుజరాత్‌ టైటాన్స్‌... హార్దిక్‌ పాండ్యాతో జీవితకాలానికి సరిపడా ఒప్పందమేమీ కుదుర్చుకోలేదు కదా! జట్టుతో ఉండాలా, వీడి వెళ్లాలా అన్నది అతడి నిర్ణయం. ఇప్పుడు శుబ్‌మన్‌ కెప్టెన్‌ అయ్యాడు.

సారథిగా తనకూ అనుభవం వస్తుంది. ఏదో ఒకరోజు గిల్‌ కూడా జట్టును వీడి వెళ్లే అవకాశం ఉంది. ఆటలో ఇవన్నీ సహజం. ఆటగాళ్లు వస్తూ.. పోతూనే ఉంటారు’’ అని న్యూస్‌24తో షమీ వ్యాఖ్యానించాడు.

అలా చేస్తే గిల్‌ సక్సెస్‌ అవుతాడు 
అదే విధంగా.. కెప్టెన్‌గా ఉన్నపుడు జట్టుతో పాటు వ్యక్తిగత ప్రదర్శన పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని షమీ పేర్కొన్నాడు. రానున్న సీజన్‌లో శుబ్‌మన్‌ గిల్‌ సారథిగా, బ్యాటర్‌గా తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తాడనే నమ్మకం ఉందని తెలిపాడు. ఆటగాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టగలిగితే కెప్టెన్‌ పని సులువే అవుతుందని షమీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.

కాగా గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున ఐపీఎల్‌-2023లో 17 మ్యాచ్‌లు ఆడిన షమీ.. 28 వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచి పర్పుల్‌ క్యాప్‌ అందుకున్నాడు. మరోవైపు.. శుబ్‌మన్‌ గిల్‌ 17 మ్యాచ్‌లలో కలిపి 890 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు. 

చదవండి: చరిత్రకు ఆరు పరుగుల దూరంలో కోహ్లి.. కొడితే!

Advertisement
 
Advertisement