
నేడు రాజస్తాన్ రాయల్స్‌తో పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్,జియో హాట్‌స్టార్‌లో
ముల్లాన్‌పూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్... రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. ‘డబుల్ హెడర్’లో భాగంగా శనివారం జరగనున్న రెండో పోరులో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. గత పదేళ్లుగా ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయిన పంజాబ్ జట్టు... ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ శిక్షణ, శ్రేయస్ అయ్యర్ కెపె్టన్సీలో తాజా సీజన్‌లో జోరు మీదుంది.
మరోవైపు తొలి సీజన్‌లో చాంపియన్‌గా నిలిచిన రాజస్తాన్ రాయల్స్ తిరిగి సత్తా చాటేందుకు రెడీ అయింది. ఆటేతర అంశాలతో వార్తల్లో నిలుస్తున్న రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌పై ఒత్తిడి అధికంగా ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 29, 4 పరుగులు చేసిన జైస్వాల్... ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. సీజన్ తొలి మూడు మ్యాచ్‌ల్లో కేవలం ఆటగాడిగానే బరిలోకి దిగిన సంజూ సామ్సన్... ఈ మ్యాచ్‌లో సారథ్య బాధ్యతలు అందుకోనున్నాడు.
గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో వికెట్ కీపింగ్ చేసేందుకు బీసీసీఐ అతడికి అనుమతినిచ్చింది. జైస్వాల్, సామ్సన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, హెట్‌మైర్, హసరంగతో రాయల్స్ బ్యాటింగ్ బలంగా కనిపిస్తోంది. ఆర్చర్, తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, శుభమ్ శర్మ బౌలింగ్ భారం మోయనున్నారు. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన పంజాబ్ కింగ్స్... సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది.
అటు విదేశీ హిట్టర్లు... ఇటు స్వదేశీ ప్లేయర్లతో పంజాబ్ పటిష్టంగా ఉంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... శ్రేయస్ అయ్యర్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, శశాంక్ సింగ్, యాన్సెన్‌తో మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. అర్ష్ దీప్ సింగ్‌తో కలిసి ఫెర్గూసన్, యాన్సెన్ పేస్ భారం మోయనుండగా... యుజ్వేంద్ర చహల్ స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నాడు. పెద్ద బౌండరీలతో కూడిన ముల్లాన్‌పూర్ మైదానం స్పిన్‌కు అనుకూలించనుంది. గత సీజన్‌లో ఇక్కడ ఓ మాదిరి స్కోర్లే నమోదు కాగా... బౌలింగ్ బలంతోనే జట్లు విజయాలు సాధించాయి.
తుది జట్లు (అంచనా)
రాజస్తాన్ రాయల్స్: సామ్సన్ (కెప్టెన్ ), జైస్వాల్, రాణా, పరాగ్, జురేల్, హసరంగ, హెట్‌మైర్, ఆర్చర్, తీక్షణ, తుషార్, సందీప్, శుభమ్ దూబే.
పంజాబ్ కింగ్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్ ), ప్రభ్‌సిమ్రన్, ప్రియాంశ్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, శశాంక్ సింగ్, సుర్యాంశ్, యాన్సెన్, ఫెర్గూసన్, అర్ష్ దీప్, చహల్, వైశాక్.