ENG vs IND 5th Test: ఆఖరి టెస్టులో భారత్‌ ‘పట్టు’.. చతేశ్వర్‌ పుజారా అర్ధసెంచరీ

Pujara-Pant Take Indias Lead Past 250 Runs Vs ENG Test Match - Sakshi

గతేడాది 2–1తో ఆగిపోయిన ఐదు టెస్టుల సిరీస్‌ 3–1తో తమ వశమయ్యే దిశగా భారత్‌ అడుగులేస్తోంది. ఇంగ్లండ్‌ బ్యాటర్లను మన బౌలర్లు కట్టడి చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు 300 పరుగుల్లోపే ఆలౌటైంది. భారత్‌కు 132 పరుగుల ఆధిక్యం లభించగా, రెండో ఇన్నింగ్స్‌లో చతేశ్వర్‌ పుజారా అర్ధసెంచరీతో టీమిండియా ఆధిక్యం 257 పరుగులకు చేరుకుంది. 

బర్మింగ్‌హామ్‌: ఆఖరి టెస్టులో భారత్‌ ‘పట్టు’ బిగించింది. భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. సీమర్ల ఉత్సాహానికి బ్యాటర్లు జతకలవడంతో ఇంగ్లండ్‌ ముందు లక్ష్యం కొండంతలా పెరుగుతోంది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లలో 3 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (4), వన్‌డౌన్‌ బ్యాటర్‌ విహారి (11) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచారు. కోహ్లి 20 పరుగులే చేసి నిష్క్రమించగా, మరో ఓపెనర్‌ చతేశ్వర్‌ పుజారా (139 బంతుల్లో 50 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) వికెట్ల ముందు గోడలా నిలబడ్డాడు. హిట్టర్‌ రిషభ్‌ పంత్‌ (46 బంతుల్లో 30 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) తన సహజశైలికి భిన్నంగా నింపాదిగా బ్యాటింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ బౌలర్లకు కష్టాలు తప్పలేదు.

ఇద్దరు కలిసి అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. అండర్సన్, బ్రాడ్, స్టోక్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అంతకుముందు ఇంగ్లండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో (140 బంతుల్లో 106; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) వీరోచిత సెంచరీతో అదరగొట్టినప్పటికీ భారత బౌలర్లు సిరాజ్‌ (4/66), షమీ (2/78), బుమ్రా (3/68) ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ను 61.3 ఓవర్లలో 284 పరుగులకు పరిమితం చేశారు. సామ్‌ బిల్లింగ్స్‌ (36; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం టీమిండియా ఓవరాల్‌ ఆధిక్యం 257 పరుగులకు చేరగా... చేతిలో ఇంకా 7 వికెట్లున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ ఫలితాన్ని శాసించే స్థితికి చేరుకుంది.  


భళా బెయిర్‌స్టో 
రెండో రోజు సగం వికెట్లను కోల్పోయి కుదేలైన ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు ఆదివారం బెయిర్‌స్టో వెన్నెముకగా నిలిచాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 84/5తో ఆట కొనసాగించిన బెయిర్‌స్టో, స్టోక్స్‌ కాసేపటికే జట్టు స్కోరును వంద పరుగులు దాటించారు. 81 బంతుల్లో 7 బౌండరీలతో బెయిర్‌స్టో ఫిఫ్టీ పూర్తికాగా... కాసేపటికే స్టోక్స్‌ (25; 3 ఫోర్లు) బుమ్రా అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన బిల్లింగ్స్‌ అండతో బెయిర్‌స్టో యథేచ్ఛగా బౌండరీలు బాదాడు. 119 బంతుల్లో (14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. ఇతన్ని షమీ అవుట్‌ చేయగా, టెయిలెండర్లలో పాట్స్‌ (19; 3 ఫోర్లు, 1 సిక్సర్‌) ఆలౌట్‌ను కాస్త ఆలస్యం చేశాడు.  

స్కోరు వివరాలు 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 416; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 284. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: గిల్‌ (సి) క్రాలీ (బి) అండర్సన్‌ 4; పుజారా (బ్యాటింగ్‌) 50; విహారి (సి) బెయిర్‌స్టో (బి) బ్రాడ్‌ 11; కోహ్లి (సి) రూట్‌ (బి) స్టోక్స్‌ 20; పంత్‌ (బ్యాటింగ్‌) 30 ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (45 ఓవర్లలో 3 వికెట్లకు) 125. 
వికెట్ల పతనం: 1–4, 2–43, 3–75. 
బౌలింగ్‌: అండర్సన్‌ 14–5–26–1, బ్రాడ్‌ 12–1– 38–1, పాట్స్‌ 8–2–20–0, లీచ్‌ 1–0–5–0, స్టోక్స్‌ 7–0–22–1, రూట్‌ 3–1–7–0. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top