వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన రెండో రంజీ మ్యాచ్‌లోనే ఉగ్రరూపం దాల్చాడు. 2025-26 ఎడిషన్‌లో (Ranji Trophy) భాగంగా చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.
ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 156 బంతులు ఎదుర్కొన్న షా.. 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో షా కేవలం 72 బంతుల్లోనే శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తంగా షాకు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 14వ సెంచరీ.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పుంజుకుని డబుల్ సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్‌తో ప్రారంభించిన షా (కేరళపై).. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 75 పరుగులతో రాణించాడు.
ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్‌ఘడ్‌పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.
104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర.. 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఫలితంగా 463 పరుగుల భారీ ఆధిక్యం సాధించి, ప్రత్యర్దికి 464 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
చదవండి: పక్కటెముకల్లో రక్తస్రావం.. సీరియస్‌గా శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి


