ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది.
ఎన్సీపీ విభజన తర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని వర్గం బీజేపీతో కలసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఊహించని విధంగా బుధవారం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. 66 ఏళ్ల అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదానికి గురైంది.
అజిత్ పవార్ ఆకస్మిక మరణంతో ఆయన స్థానాన్ని సతీమణి సునేత్ర పవార్‌కు అప్పగించాలని కూటమి పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఇతర కూటమి నేతలు సునేత్ర పవార్‌తో చర్చలు జరిపారు. ఆ చర్చలు విజయవంతం కావడంతో ఆమె ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు.
సునేత్ర పవార్ గతంలో బారామతి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అయినప్పటికీ ఆమెకు స్థానికంగా మంచి పట్టుంది. అజిత్ పవార్ వర్గం ఆమెను ఉప ముఖ్యమంత్రిగా తీసుకురావడం ద్వారా మహిళా నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా, బారామతి ప్రాంతంలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది.
ఈ నిర్ణయం వెనుక రాజకీయ సమీకరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన (శిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) కలిసి ప్రభుత్వం నడుపుతున్నాయి. ఈ క్రమంలో సునేత్ర పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా అజిత్ పవార్ వర్గానికి మరింత ప్రాధాన్యం లభించనుంది.


