KTR: ‘హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ మెరుగైన ప్రదర్శన కనబరచాలి’

Prime Volleyball League KTR Comments Hyderabad Black Hawks New Jersey Unveil - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మన రాజధాని నగరంలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. హైదరాబాద్‌లో క్రీడల వృద్ధికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటాం’’ అని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. తాజా.. సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా తెలంగాణా ప్రభుత్వ కార్యాలయంలో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ నూతన జెర్సీ విడుదల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ యజమానులు, వ్యాపారవేత్తలు అభిషేక్‌ రెడ్డి కంకణాల (ప్రిన్సిపల్‌ ఓనర్‌), శ్యామ్‌ గోపు (సహ యజమాని)తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిషేక్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘భారతదేశంలో ప్రాధమిక స్థాయి నుంచి వాలీబాల్‌  అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.  హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్ టీమ్‌ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించేందుకు కృషి చేస్తాము’’ అని అన్నారు.

‘‘తెలంగాణా ప్రభుత్వం, మంత్రి కేటీఆర్‌, జయేష్‌ రంజన్ మా టీమ్‌కు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. వారి మద్దతు మా టీమ్‌కు ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. హైదరాబాద్‌లో క్రీడాకారులకు పూర్తి మద్దతును తెలంగాణా ప్రభుత్వం అందిస్తోంది’’ అని ధన్యవాదాలు తెలిపారు. 

అదే విధంగా.. బ్రెజిల్‌, ఇటలీ, జపాన్‌ లాంటి దేశాలలో అభివృద్ధి చెందుతున్న వాలీబాల్‌ సంస్కృతిని అనుకరించే మార్గంలో భారతదేశం ఉందని అభిషేక్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘బ్లాక్‌ హాక్స్‌ టీమ్‌ ప్రాధమిక స్ధాయి నుంచి క్రీడను అభివృద్ధి చేయడానికి బహుళ అంచెల విధానాన్ని సృష్టించాల్సి ఉంది. ‘చోటు లీగ్స్‌’ను పాఠశాల విద్యార్థుల కోసం, అలాగే ‘మస్తీ లీగ్స్‌’ను టీనేజర్ల కోసం నిర్వహించడానికి ప్రణాళిక చేశాము.

తద్వారా మన దేశంలో ఈ క్రీడను మరింతగా విస్తరించనున్నాము’’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. హోరాహోరీగా అహ్మదాబాద్‌ డిఫెండర్స్‌తో జరిగిన సోమవారం నాటి మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌  13–15, 15–9, 15–14, 15–11, 10–15తో విజయం సాధించిన విషయం తెలిసిందే. తదుపరి మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్‌తో పోరుకు సిద్ధమైంది.

చదవండి: BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top