
ఆసియా కప్-2025కు ముందు టీమిండియాకు శుభవార్త అందింది. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఖండాంతర టోర్నీకి సిద్దమయ్యాడు. స్కై కొద్ది రోజుల కిందట మ్యూనిచ్‌లో స్పోర్ట్స్ హెర్నియా సర్జరీ చేయించుకున్నాడు. సర్జరీ విజయవంతం కావడంతో అతను ఎన్‌సీఏలో రిపోర్ట్ చేశాడు. ఆసియా కప్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు ఎన్‌సీఏలో తగు చర్యలు చేపట్డాడు.
ఎన్‌సీఏలో రిపోర్ట్ చేయడం వల్ల స్కైను దులీప్ ట్రోఫీ కోసం పరిగణలోకి తీసుకోలేదు. వెస్ట్ జోన్ సెలెక్టర్లు స్కై అందుబాటులో లేకపోవడంతో శార్దూల్ ఠాకూర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ జట్టులో ముంబై స్టార్లు, టీమిండియా ప్లేయర్లు యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, సర్ఫరాజ్ ఖాన్, షమ్స్ ములానీ, తనుశ్ కోటియన్, తుషార్ దేశ్‌పాండే ఉన్నారు.
కాగా, ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది. ఈ టోర్నీని సెప్టెంబర్ 9-28 మధ్య తేదీల్లో యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది. స్కై ఈ ఏడాది ఐపీఎల్‌లో చివరిసారి బ్యాట్ పట్టాడు. ఆతర్వాత అతను శస్త్ర చికిత్స నిమిత్తం మ్యూనిచ్‌కు వెళ్లాడు.
శ్రేయస్ కూడా..!
మరో టీమిండియా బ్యాటర్ కూడా ఇటీవలే ఎన్‌సీఏని సందర్శించాడు. రొటీన్ ఫిట్‌నెస్ పరీక్షల్లో భాగంగా శ్రేయస్ అయ్యర్ ఎన్‌సీఏకి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రేయస్ పూర్తి ఫిట్‌నెస్ సాధించి దులీప్ ట్రోఫీకి అందుబాటులో ఉన్నాడు. దులీప్ ట్రోఫీ ఆగస్ట్ 28 నుంచి ప్రారంభం కానుంది. వెస్ట్ జోన్ సెప్టెంబర్ 4న తమ తొలి మ్యాచ్ ఆడనుంది.