
చెన్నై: మాజీ చాంపియన్ దబంగ్ ఢిల్లీ ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ (PKL 12)లో పదో విజయంతో ‘టాప్’ లేపింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో దబంగ్ ఢిల్లీ జట్టు 29–26తో మాజీ విజేత జైపూర్ పింక్‌పాంథర్స్‌పై గెలుపొందింది.
కెప్టెన్, రెయిడర్ అశు మలిక్ 8 పాయింట్లతో అదరగొట్టాడు. 17 సార్లు కూతకెళ్లిన ఢిల్లీ కెపె్టన్ 8 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. డిఫెండర్ సందీప్ (7) కూడా రాణించడంతో దబంగ్ జట్టు ప్రత్యరి్థపై పైచేయి సాధించింది.
ఆఖరి వరకు పోరాడినా..
మరోవైపు జైపూర్ పింక్ పాంథర్స్ సమష్టిగా గెలిచేందుకు పోరాడింది. డిఫెండర్లు రెజా మీర్‌బగేరి (5), దీపాన్షు ఖత్రి (5), ఆర్యన్ కుమార్ (4) ప్రత్యర్థి రెయిడర్లను బెంబేలెత్తించారు. రెయిడర్లలో మీతు, అలీ సమది చెరో 2 పాయింట్లు చేశారు. 11 మ్యాచ్‌లాడిన దబంగ్ ఢిల్లీ 10 విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
యూపీపై పట్నా గెలుపు
అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ 36–28తో యూపీ యోధాస్‌పై విజయం సాధించింది. పైరేట్స్ తరఫున రెయిడర్ అయాన్ (15) చెలరేగాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను క్రమం తప్పకుండా పాయింట్లు తెచ్చిపెట్టాడు.
మిగతా వారిలో డిఫెండర్లు నవ్‌దీప్ (5), దీపక్ (4) రాణించారు. యూపీ యోధాస్ జట్టులో రెయిడర్ గగన్ (10) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారిలో శివమ్ (3), మహేందర్ సింగ్ (2), హితేశ్ (2), సుమిత్ (2) ఫర్వాలేదనిపించారు. ఇక మంగళవారం జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో తమిళ్ తలైవాస్, హరియాణా స్టీలర్స్‌తో దబంగ్ ఢిల్లీ తలపడనున్నాయి.