
Photo Courtesy: BCCI/IPL
పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell)కు ఐపీఎల్ పాలక మండలి షాకిచ్చింది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం మేర కోత విధించింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో అనుచిత ప్రవర్తనకు గానూ ఈ మేర జరిమానా వేసింది.
ప్రియాన్ష్ మెరుపు శతకం
ఐపీఎల్-2025 (IPL 2025)లో భాగంగా ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్- చెన్నై జట్లు తలపడ్డాయి. సొంత మైదానంలో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య విధ్వంసకర శతకం (42 బంతుల్లో 103) చెలరేగగా.. లోయర్ ఆర్డర్‌లో శశాంక్ సింగ్ (36 బంతుల్లో 52 నాటౌట్), మార్కో యాన్సెన్ (19 బంతుల్లో 34 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
దీంతో మిగతా బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టినా.. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు సాధించింది.
చెన్నై బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ రెండేసి వికెట్లు తీయగా.. ముకేశ్ చౌదరి, నూర్ అహ్మద్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో చెన్నై 201 పరుగులకే పరిమితమైంది.
18 పరుగుల తేడాతో చెన్నై ఓటమి
ఓపెనర్ రచిన్ రవీంద్ర (36) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం అర్ధ శతకం(49 బంతుల్లో 69) రాణించాడు.
కానీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశపరచగా.. శివం దూబే 27 బంతుల్లో 42 రన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో ధోని ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. 12 బంతుల్లో 27 పరుగులు చేశాడు. కానీ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై పంజాబ్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Sights we have come to cherish over many years 💛
MS Dhoni produced a fighting knock of 27(12) 🔥
Scorecard ▶ https://t.co/HzhV1Vtl1S #TATAIPL | #PBKSvCSK | @msdhoni pic.twitter.com/Y3ksZl8ozS— IndianPremierLeague (@IPL) April 8, 2025
కీలక వికెట్ తీసి
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లోనూ గ్లెన్ మాక్స్‌వెల్ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. ఆరో స్థానంలో వచ్చి రెండు బంతులు ఎదుర్కొని అశ్విన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే, రచిన్ రవీంద్ర రూపంలో కీలక వికెట్ తీసి పంజాబ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. కానీ అనుచిత ప్రవర్తనకు గానూ అతడు పనిష్మెంట్ ఎదుర్కోవాల్సి వచ్చింది.
జరిమానాతో పాటు డీమెరిట్ పాయింట్
ఇందుకు సంబంధించి.. ‘‘గ్లెన్ మాక్స్‌వెల్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2లో గల లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్ రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని అతడు అంగీకరించాడు. నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్నాం’’ అని ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
అదే విధంగా.. మాక్సీ ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్ జత చేసింది. అయితే, ఏ ఘటనలో అతడికి జరిమానా విధించిందన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా వెల్లడించలేదు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రూపొందించిన నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం.. ఉద్దేశపూర్వకంగా వికెట్లను తన్నడం, బాదడం.. అడ్వర్టైజ్ బోర్డులు, బౌండరీ ఫెన్సింగ్, డ్రెసింగ్ రూమ్ అద్దాలు, కిటికీలు.. ఇతర సామాగ్రి దెబ్బతినేలా ప్రవర్తించడం వంటివి చేస్తే ఇలాంటి కఠిన చర్యలు ఉంటాయి.
చదవండి: IPL 2025: ప్రియాన్ష్ విధ్వంసకర సెంచరీ.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా