
పరువు కాపాడుకునేందుకు రాజస్తాన్ రాయల్స్
ఐపీఎల్‌లో నేడు కీలక పోరు
మధ్యాహ్నం గం. 3:30 నుంచి
స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
జైపూర్: ఐపీఎల్‌లో అనూహ్యంగా ఆగిపోయిన తమ ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టేందుకు పంజాబ్ కింగ్స్ సిద్ధమైంది. మే 9న ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా శుభారంభం చేసిన తర్వాత మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో పంజాబ్ గెలుపు అవకాశం చేజార్చుకుంది. ఇప్పుడు లీగ్‌లో బలహీన జట్టుపై గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు మరింత చేరువ కావాలని జట్టు భావిస్తోంది. నేడు జరిగే పోరులో రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ తలపడుతుంది. ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు ఇప్పటికే కోల్పోయిన రాజస్తాన్ లీగ్‌లో చివరి స్థానంలో నిలవకుండా ఉండాలని కోరుకుంటోంది.
తొలిసారి మిచ్ ఓవెన్...
ఐపీఎల్ వాయిదా పడటంతో పంజాబ్ ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లు స్టొయినిస్, ఇన్‌గ్లిస్ తిరిగి రావడానికి విముఖత చూపారు. దాంతో ఇప్పుడు తప్పనిసరి స్థితిలో తుది జట్టులో మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మ్యాక్స్‌వెల్ గాయంతో తప్పుకోవడంతో జట్టులోకి వచ్చిన మిచెల్ ఒవెన్ తొలిసారి ఐపీఎల్ బరిలోకి దిగడం ఖాయమైంది. విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒవెన్ గత ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలవడంతో పాటు హోబర్ట్ హరికేన్స్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే టాపార్డర్ బ్యాటర్ అయిన ఒవెన్... ప్రస్తుతం పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్‡్ష ఆర్య అద్భుతంగా ఆడుతుండటంతో మిడిలార్డర్‌లో ఆడాల్సి రావచ్చు. బౌలింగ్‌ను పటిష్టపర్చుకోవడంలో భాగంగా కివీస్ పేసర్ కైల్ జేమీసన్‌ను పంజాబ్ ఆడించే అవకాశం ఉంది. శ్రేయస్, వధేరా, శశాంక్‌లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. చహల్, అర్‡్షదీప్ ఫామ్‌లో ఉండటంతో పాటు మార్కో యాన్సెన్ కూడా మెరుగ్గా రాణిస్తుండటం పంజాబ్‌కు సానుకూలాంశం.
బరిలోకి సంజు సామ్సన్...
రాజస్తాన్ పేలవ ఆటతో చాలా ముందే ప్లే ఆఫ్స్ అవకాశాలు చేజార్చుకుంది. జట్టు 12 మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లే గెలిచింది. మిగిలిన మ్యాచ్‌లలోనైనా రాణించి పరువు కాపాడుకోవాలని టీమ్ భావిస్తోంది. నెల రోజుల క్రితం తన ఆఖరి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సంజు సామ్సన్ కోలుకొని ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగుతున్నాడు. జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా రాణిస్తుండటంతో అతను మూడో స్థానంలో ఆడతాడు. పరాగ్, జురేల్ కూడా రాణిస్తే రాయల్స్ మెరుగైన స్థితిలో నిలుస్తుంది. విదేశీ ఆటగాళ్లు హెట్‌మైర్, హసరంగ, తీక్షణ జట్టుతో చేరారు. అయితే టోర్నీ ఆరంభంనుంచి చాలా బలహీనంగా ఉన్న రాజస్తాన్ పేస్ బృందం ఆర్చర్, సందీప్ శర్మ దూరం కావడంతో ఇప్పుడు మరింత బలహీనంగా మారింది. తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ మధ్వాల్, నాండ్రే బర్గర్ పంజాబ్ బ్యాటర్లను ఎలా నిలువరిస్తారో చూడాలి.