Euro 2020: Paul Pogba Removes Beer Bottle, Video Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

కోక్‌ బాటిల్‌ వ్యవహారంతో 30 వేల కోట్లు హాంఫట్‌, మరి ఈయన బీర్‌ బాటిల్‌ తీసేశాడు

Published Wed, Jun 16 2021 4:07 PM

Paul Pogba Follows Cristiano Ronaldo Removes Heineken Beer Bottle - Sakshi

మ్యూనిచ్‌‌: స్టార్‌ ఫుట్‌బాల్‌ ఆటగాళ్లు ఒక్కొక్క‌రుగా ప్ర‌జ‌ల‌కు హాని క‌లిగించే పానీయాలపై బహిరంగంగానే త‌మ వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తున్నారు. యూరో 2020లో భాగంగా రెండు రోజుల కిందట జరిగిన ప్రెస్ మీట్‌లో పోర్చుగ‌ల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో త‌న ముందున్న కోకాకోలా బాటిల్‌ను  తీసి ప‌క్క‌న పెట్టిన విష‌యం తెలిసిందే. కోలా వ‌ద్దు, నీళ్లే ముద్దు అన్న అత‌ని సందేశం కోకాకోలా కంపెనీకి సుమారు రూ.30 వేల కోట్ల న‌ష్టం తెచ్చిపెట్టింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఫ్రాన్స్ స్టార్ ప్లేయ‌ర్ పాల్ పోగ్బా కూడా రొనాల్డో రూట్లోనే వెళ్లాడు. నిన్న జ‌ర్మ‌నీతో మ్యాచ్ సంద‌ర్భంగా ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌కు వ‌చ్చిన పోగ్బా.. త‌న ముందు ఉన్న హైనెకెన్ కంపెనీకి చెందిన బీర్ బాటిల్‌ను తీసి కింద పెట్టాడు. మరి పోగ్బా చేసిన ఈ పని వల్ల సదరు బీర్‌ కంపెనీకి ఎంత నష్టం వాటిల్లబోతుందో లెక్కకట్టే పనిలో పడ్డారు మార్కెట్‌ నిపుణులు.

కాగా, ఇస్లాం మ‌తాన్ని ఆచ‌రించే పోగ్బాకు ఆల్కహాల్‌ సేవించే అల‌వాటు లేదు. ఈ విష‌యాన్ని అత‌ను చాలాసార్లు బహిరంగా ప్రస్తావించాడు. తాజాగా జరిగిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఆల్కహాల్‌ ఉత్పత్తి అయిన బీర్‌ బాటిల్‌ను పక్కకు పెట్టడం ద్వారా మందుపై త‌నకున్న వ్య‌తిరేక‌త‌ను మరోసారి ప్ర‌త్య‌క్షంగా బహిర్గతం చేశాడు. పోగ్బాలా ఇస్లాంను ఆచరించే మరికొందరు క్రీడాకారులు సైతం మద్యం ఉత్పత్తుల ప్రమోషన్‌కు దూరంగా ఉంటారు. ఇంగ్లీష్‌ క్రికెటర్లు మొయిన్ అలీ, ఆదిల్‌ ర‌షీద్, దక్షిణాఫ్రికా మాజీలు హాషిమ్‌ ఆమ్లా, ఇమ్రాన్‌ తాహిర్‌లు మద్యం కంపెనీల పేర్లను తమ దుస్తులపై ధరించేందుకు సైతం ఇష్టపడరు. హైనెకెన్ బేవ‌రేజ్ కంపెనీ ప్ర‌స్తుతం జరుగుతున్న యూరో 2020కి ప్రధాన స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.
చదవండి: రొనాల్డో చర్య.. కోకా కోలాకు భారీ డ్యామేజ్‌.. మరి ఆ యాడ్‌!

Advertisement
Advertisement