PAK VS ENG 1st Test: టెస్ట్‌ మ్యాచా లేక టీ20నా.. ఇదేం బాదుడురా సామీ, ఒకే రోజు నలుగురు సెంచరీలు

PAK VS ENG 1st Test: 4 England Players Scored Centuries In T20 Mode - Sakshi

3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడేందుకు 17 ఏళ్ల సుదర్ఘీ విరామం తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ జట్టు.. రావల్పిండి వేదికగా ఇవాళ  (డిసెంబర్‌ 1) మొదలైన తొలి టెస్ట్‌లో పరుగుల వరద పారించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ టీమ్‌.. టీ20 తరహాలో బ్యాటింగ్‌ చేసి రికార్డు స్కోర్‌ సాధించింది.

ఏకంగా నలుగురు బ్యాటర్లు శతకాలు సాధించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 506 పరుగుల అత్యంత భారీ స్కోర్‌ నమోదు చేసిం‍ది. తొలి రోజు 75 ఓవర్ల పాటు ఆట సాగగా.. ఇంగ్లండ్‌ బ్యాటర్లు 6.75 రన్‌రేట్‌ చొప్పున పరుగులు పిండుకున్నారు. ఇంగ్లండ్‌ బ్యాటర్ల మహోగ్రరూపం ధాటికి విలవిలలాడిపోయిన పాక్‌ బౌలర్లు ప్రేక్షక పాత్రకు పరిమతమయ్యారు.

ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (106 బంతుల్లో 101 నాటౌట్‌; 14 ఫోర్లు), జాక్‌ క్రాలే (106 బంతుల్లో 120 నాటౌట్‌; 21 ఫోర్లు), ఓలీ పోప్‌ (104 బంతుల్లో 108; 14 ఫోర్లు), హ్యారీ బ్రూక్‌ (81 బంతుల్లో 101 నాటౌట్‌) సెంచరీలతో విరుచుకుపడ్డారు. సెంచరీకి ముందు హ్యారీ బ్రూక్‌.. సౌద్‌ షకీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 68వ ఓవర్‌లో 6 బౌండరీలు బాదగా.. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా కెప్టెన్‌ స్టోక్స్‌ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 6 ఫోర్లు,  సిక్స్‌) పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు.

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్క రూట్‌ (31 బంతుల్లో 23; 3 ఫోర్లు) మినహాయించి అందరూ టీ20ల్లోలా రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన వారికి కచ్చితంగా టీ20 మ్యాచ్‌ చూసిన అనుభూతే కలిగి ఉంటుంది. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ అలీ (5.6) మినహా అందరూ 6కు పైగా ఎకనామీతో పరుగులు సమర్పించుకున్నారు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ బ్యాటర్లను ఆపడం పాక్‌ బౌలర్లకు సాధ్యమవుతుందో లేదో వేచి చూడాలి.  


 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top