NZ Vs BAN 1st Test: కాన్వే అద్భుత శతకం.. తొలి రోజు ఆటలో న్యూజిలాండ్‌దే పైచేయి

NZ Vs BAN 1st Test: Devon Conway Ton Anchors New Zealand - Sakshi

బే ఓవల్‌: నూతన సంవత్సరం(2022) తొలి రోజున ప్రారంభమైన టెస్ట్‌ మ్యాచ్‌లో డెవాన్ కాన్వే(227 బంతుల్లో 122; 16 ఫోర్లు, సిక్స్‌) అద్భుత శతకంతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి రోజు ఆటలో ఆతిధ్య న్యూజిలాండ్‌దే పైచేయిగా నిలిచింది. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో పర్యాటక బంగ్లా జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా బౌల‌ర్ షోరిఫుల్ ఇస్లాం కివీస్‌ను ఆరంభంలోనే దెబ్బ‌కొట్టాడు. ఓపెనర్‌ టామ్ లాథ‌మ్‌ కేవలం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి షోరిఫుల్‌ బౌలింగ్‌లో ఔట్ కావడంతో న్యూజిలాండ్ ఒక్క ప‌రుగుకే తొలి వికెట్ కోల్పోయింది. 

వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కాన్వే.. మ‌రో ఓపెన‌ర్ విల్ యంగ్‌తో క‌లిసి ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. వీరిద్ద‌రు రెండో వికెట్‌కు 138 ప‌రుగుల సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. జ‌ట్టు స్కోర్ 139 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా విల్‌ యంగ్‌(52) ర‌నౌట్ కావడంతో న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. అనంత‌రం బరిలోకి దిగిన రాస్ టేల‌ర్‌(31), టామ్‌ బ్లండెల్‌(11) నామమాత్రపు స్కోర్లు చేసి ఔట్‌ కాగా, కాన్వే శతక్కొట్టిన అనంతరం వెనుదిరిగాడు. 

తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి న్యూజిలాండ్ 5 వికెట్ల నష్టానికి 258 పరుగులు సాధించింది. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్‌ 2, ఎబాదత్‌ హుసేన్‌, మొమినుల్‌ హాక్‌ తలో వికెట్‌ పడగొట్టగా.. విల్‌ యంగ్‌ రనౌటయ్యాడు. కాగా, గతేడాది జరిగిన టీ20 ప్రపంచక‌ప్‌లో గాయ‌ప‌డి కాన్వే..  7 వారాల పాటు జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. అనంతరం గాయం నుంచి కోలుకుని ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ బాదాడు.
చదవండి: గాయం నుంచి తిరిగొచ్చాడు.. 2022లో తొలి సెంచరీ బాదాడు
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top