
ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం
కివీస్‌ను గెలిపించిన మ్యాట్ హెన్రీ
ముక్కోణపు టి20 టోర్నమెంట్ ట్రోఫీ దక్కించుకోవాలంటే దక్షిణాఫ్రికా జట్టుకు 18 బంతుల్లో 37 పరుగులుకావాలి. అలాంటి దశలో... డెవాల్డ్ బ్రేవిస్ మూడు సిక్స్‌లతో విజృంభించడంతో సఫారీ సమీకరణం 6 బంతుల్లో 7 పరుగులకు చేరింది. ఇంకేముంది దక్షిణాఫ్రికా విజయం ఖాయమే అనుకుంటే... ఆఖర్లో కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ అద్భుతం చేశాడు. జోరుమీదున్న బ్రేవిస్, హెన్రీలను అవుట్ చేసి న్యూజిలాండ్‌కు ట్రోపీ కట్టబెట్టాడు. దీంతో సఫారీలకు నిరాశ తప్పలేదు.
హరారే: ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. శనివారం చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (31 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (27 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్ సీఫెర్ట్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులకు పరిమితం అయింది. డ్రె ప్రిటోరియస్ (35 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశకతంతో రాణించగా... రీజా హెండ్రిక్స్ (37; 4 సిక్స్‌లు), డెవాల్డ్ బ్రేవిస్ (16 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. బంతి బంతికి సమీకరణాలు మారుతూ దక్షిణాఫ్రికా విజయం ఖాయమే అనుకుంటున్న సమయంలో హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు.
అప్పటి వరకు ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు ఆఖర్లో ఒత్తిడికి చిత్తై ట్రోఫీని కివీస్‌కు కట్టబెట్టారు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ట్రోఫీ కైవసం చేసుకుంది. మ్యాట్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.