Sakshi Premier League: ఫైనల్లో ఎన్‌ఆర్‌ఐ, సాయి గణపతి కాలేజీలు

NRI and Sai Ganapathy Colleges in the final - Sakshi

చేబ్రోలు: సాక్షి ప్రీమియర్‌ లీగ్‌ (ఎస్‌పీఎల్‌) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయి జూనియర్, సీనియర్‌ స్థాయి పురుషుల క్రికెట్‌ టోర్నమెంట్‌ తుది దశకు చేరుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఈ టోర్నీ జరుగుతోంది.జూనియర్‌ విభాగంలో సాయి గణపతి పాలిటెక్నిక్‌ కాలేజి (విశాఖపట్నం), ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కాలేజి (విజయవాడ) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఏపీ ఐఐఐటీ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్‌లో సాయి గణపతి పాలిటెక్నిక్‌ కాలేజి తొమ్మిది వికెట్ల తేడాతో నెగ్గింది.

మొదట ఏపీ ఐఐఐటీ నిరీ్ణత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. ఎ.రాంబాబు (37; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయంగా నిలిచాడు. సాయి గణపతి బౌలర్లలో బి.కుమార్‌ మూడు వికెట్లు తీశాడు. అనంతరం సాయి గణపతి కాలేజి 8.2 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 69 పరుగులు చేసి గెలిచింది. జి.బౌరి (44 నాటౌట్‌; 4 ఫోర్లు), మధు (18 నాటౌట్‌; 2 ఫోర్లు) ఆకట్టుకున్నారు. ఏపీ ఐఐఐటీ (ఇడుపులపాయ)తో జరిగిన మరో మ్యాచ్‌లో ఎన్‌ఆర్‌ఐ కాలేజి 30 పరుగుల తేడాతో నెగ్గింది.

ముందుగా ఎన్‌ఆర్‌ఐ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. ఎస్‌కే జాఫర్‌ (46 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌), ఇక్తాన్‌ సింగ్‌ (30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. 99 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఏపీ ఐఐఐటీ 5 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఎన్‌ఆర్‌ఐ కాలేజి బౌలర్‌ బి.తరుణ్‌ నాలుగు వికెట్లు తీశాడు. ఏపీ ఐఐఐటీ జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది.  

సీనియర్‌ విభాగంలో ఎంవీజీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (విజయనగరం)పై సర్‌ సీఆర్‌ రెడ్డి కాలేజి ఆఫ్‌ ఇంజినీరింగ్‌ (ఏలూరు) పరుగు తేడాతో గెలిచింది. తొలుత సర్‌ సీఆర్‌ రెడ్డి కాలేజి నిరీ్ణత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. వి.గగన్‌ కుమార్‌ (37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. ఎంవీజీఆర్‌ కాలేజి బౌలర్లు కల్యాణ్‌ మూడు వికెట్లు, సురేష్‌ రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఎంవీజీఆర్‌ కాలేజి నిర్ణీత 10 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసి ఒక పరుగు తేడాతో విజయాన్ని చేజార్చుకుంది. నేడు సీనియర్‌ విభాగం ఫైనల్లో సీకామ్‌ డిగ్రీ కాలేజీతో సర్‌ సీఆర్‌ రెడ్డి కాలేజి ఆఫ్‌ ఇంజినీరింగ్‌ జట్టు; జూనియర్‌ విభాగం ఫైనల్లో ఎన్‌ఆర్‌ఐ కాలేజితో సాయి గణపతి పాలిటెక్నిక్‌ కాలేజి తలపడతాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top