ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ (PC: BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఫలితంగా అతడు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాలుగు మ్యాచ్‌లు
కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్ తాజా ఎడిషన్ మొదలుకానున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్-2026కు సంబంధించి బీసీసీఐ తొలుత కేవలం ఇరవై మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది.
ఇందులో భాగంగా సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే సొంత మైదానం ఉప్పల్ (Uppal)లో ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లోనూ కమిన్స్ తమ జట్టుకు సారథ్యం వహిస్తాడని సన్‌రైజర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, వెన్ను నొప్పి కారణంగా యాషెస్‌లో కొన్ని మ్యాచ్‌లు సహా టీ20 ప్రపంచకప్-2026 మొత్తానికి దూరమైన కమిన్స్ (Pat Cummins).. గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కథనం పేర్కొంది.
వారిద్దరిలో ఒకరు సారథి?
ఒకవేళ కమిన్స్ నిజంగానే ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే ఓపెనింగ్ జోడీ ట్రవిస్ హెడ్- అభిషేక్ శర్మలలో ఒకరు సన్‌రైజర్స్‌ను ముందుకు నడిపిస్తారని వార్తలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దేశీ బాయ్, టీ20 వరల్డ్‌కప్ స్టార్ అభిషేక్ శర్మకే పగ్గాలు దక్కనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇషాన్ వైపే యాజమాన్యం మొగ్గు?
అయితే, తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్ డైనమైట్, సన్‌రైజర్స్ వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు ఈ బంపరాఫర్ దక్కినట్లు తెలుస్తోంది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో జార్ఖండ్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించి తొలి టైటిల్ అందించాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్.
ఈ క్రమంలో జాతీయ జట్టులోకి తిరిగి వచ్చి.. టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇషాన్ కిషన్. మరోవైపు.. అభిషేక్ శర్మకు కూడా దేశీ క్రికెట్‌లో పంజాబ్‌కు సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది.
అయితే, సన్‌రైజర్స్ యాజమాన్యం మాత్రం కమిన్స్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను నియమించేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అభిషేక్‌పై అదనపు భారం పడకుండా ఉండేందుకు ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.


