
భారత క్రికెట్‌లో అత్యంత గొప్ప క్రికెటర్లు ఎవరన్న ప్రశ్నకు టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) తనదైన శైలిలో బదులిచ్చాడు. తన దృష్టిలో ఐదుగురు ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్లు ఉన్నారన్న ఈ మాజీ సారథి.. 70, 80, 90వ దశకాల నుంచి ముగ్గురు ఆటగాళ్లకు ఇందులో చోటిచ్చాడు.
ఇక నయా క్రికెటర్లలో దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni)తో పాటు లెజెండరీ బ్యాటర్, తనకు అత్యంత సన్నిహితుడైన విరాట్ కోహ్లిల పేర్లను రవిశాస్త్రి ఈ జాబితాలో చేర్చాడు. ఈ మేరకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు మైకేల్ వాన్, అలిస్టర్ కుక్‌లతో కలిసి క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రవిశాస్త్రిని.. భారత అత్యుత్తమ క్రికెటర్లలో టాప్-5 పేర్లు చెప్పాల్సిందిగా అడిగారు.
ధోనికే పెద్దపీట
ఇందుకు బదులిస్తూ.. ‘‘కచ్చితంగా ఈ జాబితాలో సునిల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండుల్కర్ ఉంటారు.. వీరితో పాటు విరాట్ కోహ్లి కూడా ఉండాల్సిందే.. వీరంతా తమ అద్భుత ఆట తీరుతో యువ ఆటగాళ్లపై ప్రభావం చూపారు.
నిజానికి బిషన్ సింగ్ బేడీ పేరు కూడా చెప్పాలి. కానీ ఎంఎస్ ధోని ఆయన కంటే ముందు వరుసలో ఉంటాడు. ఇక జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. అయితే, అతడు ఇంకా యువకుడే.. తనలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలి ఉంది. మిగిలిన వాళ్లు తమ అంతర్జాతీయ క్రికెట్‌ను ముగించేశారు కదా!
నంబర్ వన్ అంటే సచినే
నా దృష్టిలో సన్నీ కపిల్, సచిన్, ధోని, విరాట్... ఈ ఐదుగురే ఆల్‌టైమ్ టాప్-5 గ్రేటెస్ట్ ప్లేయర్లు. వీరిలో నంబర్ వన్ ఎవరని అడిగితే గావస్కర్ పేరే చెప్తా. అతడి బ్యాటింగ్ అద్భుతం. ఇక కపిల్ అసాధారణ క్రికెటర్.
అయితే, వీరందరిలో ఫుల్ ప్యాకేజీ నంబర్ వన్ ఎవరంటే సచిన్ టెండుల్కర్. 24 ఏళ్ల పాటు సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన అతడు.. ఏకంగా 100 సెంచరీలు సాధించాడు. వసీం అక్రమం, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్ వంటి పాక్ పేస్ దిగ్గజాలను..
అదే విధంగా.. ఆసీస్, ఇంగ్లండ్ పేసర్లు స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.. ప్రొటిస్ నుంచి జాక్వెస్ కల్లిస్, షాన్ పొలాక్.. ఇలాం ప్రతి ఒక్కరిని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. టెక్నిక్ పరంగా అతడి ఆట అమోఘం’’ అని రవిశాస్త్రి అలిస్టర్ కుక్, మైకేల్ వాన్‌లకు చెప్పాడు. అయితే, టీమిండియాకు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన మరో దిగ్గజ కెప్టెన్, మేటి బ్యాటర్ రోహిత్ శర్మకు మాత్రం రవిశాస్త్రి టాప్-5లో చోటివ్వలేదు.
కాగా 1981- 1992 వరకు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రవిశాస్త్రి.. అంతర్జాతీయ స్థాయిలో 80 టెస్టులు, 150 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 11 శతకాలు, ఒక డబుల్ సెంచరీ సాయంతో 3839 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డేల్లో 3108 రన్స్ రాబట్టాడు. ఇందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి.
చదవండి: IND vs ENG: అతడిని కాదని అన్షుల్‌ను ఎలా ఎంపిక చేస్తారు?: సెలక్టర్లపై ఫైర్