
టెస్టుల్లో పది వేల పరుగుల మైలురాయిని అందుకోకుండానే విరాట్ కోహ్లి సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో 123 టెస్టులాడిన ఈ దిగ్గజ బ్యాటర్.. 9230 పరుగుల వద్ద నిలిచిపోయాడు. అతడి టెస్టు కెరీర్‌లో 31 అర్ధశతకాలు, 30 సెంచరీలు, ఏడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఫోర్లు 1027 కాగా.. సిక్సర్లు 30. అందుకున్న క్యాచ్‌లు 121.
ఇక కెప్టెన్‌గానూ టెస్టుల్లో కోహ్లి చెరగని ముద్ర వేశాడు. సారథిగా మొత్తంగా టీమిండియాకు నలభై విజయాలు అందించి.. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. ఈ ప్రయాణంలో కోహ్లి కలిసి టెస్టుల్లో ఆడిన భారత అత్యుత్తమ తుదిజట్టును ఎంపిక చేయాలంటే..!
ఓపెనింగ్ జోడీ.. టాపార్డర్ ఇదే
వీరేందర్ సెహ్వాగ్.. కోహ్లితో కలిసి ఆడిన సమయంలో 83.79 స్ట్రైక్‌రేటుతో కనీసం 400 పరుగులు సాధించాడు. మరోవైపు.. రోహిత్ శర్మ.. కోహ్లి కెప్టెన్సీలో టాపార్డర్‌కు ప్రమోట్ అయిన హిట్‌మ్యాన్.. కోహ్లితో కలిసి దాదాపు 60 మ్యాచ్‌లు ఆడాడు.
అలా రోహిత్ ఖాతాలో 3772 పరుగులు జమయ్యాయి. ఇక వన్‌డౌన్‌లో రాహుల్ ద్రవిడ్‌కే ఓటు వెయ్యవచ్చు. కోహ్లితో కలిసి ద్రవిడ్ ఎనిమిది టెస్టులు మాత్రమే ఆడాడు.
ఇక ఛతేశ్వర్ పుజారా విషయానికొస్తే.. కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేసి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చెప్పవచ్చు. 19 శతకాల సాయంతో 6664 రన్స్ సాధించాడు పుజ్జీ. అయితే, తనకంటే టెస్టు బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లో వాల్ రాహుల్ ద్రవిడ్ ఉండటమే ఉత్తమమని గతంలో పుజారా పేర్కొన్నాడు.
మిడిలార్డర్ ఇలా
కాబట్టి ఈ జట్టులో అతడికి చోటు దక్కడం లేదు. ఇక నాలుగో స్థానంలో దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్. కోహ్లితో కలిసి 17 టెస్టుల్లో భాగమైన సచిన్ 835 పరుగులు చేశాడు. వీరిద్దరు కలిసి ఆడే సమయంలో సచిన్ నాలుగు, కోహ్లి ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసేవారు.
ఇక్కడ అత్యుత్తమ జట్టులోనూ అదే కొనసాగిస్తే బాగుంటుంది కదా! ఇక ఆరోస్థానం విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోని కంటే.. రిషభ్ పంత్ ఇక్కడ బెటర్ అనిపిస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా పంత్ టెస్టుల్లో ధోనిని మించిపోయాడు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా (SENA)లో పంత్‌కు మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈసారి అతడికే ఓటు వేయవచ్చు.
కోహ్లితో ఆడిన సమయంలో ధోని 1587 పరుగులు చేయగా.. పంత్ మాత్రం ఏకంగా 2657 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు శతకాలు కూడా ఉండటం విశేషం.
అదరగొట్టిన స్పిన్ ద్వయం
కోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అశ్విన్ కోహ్లి ఉన్న జట్టులో భాగమై ఏకంగా 475 వికెట్లు తీస్తే.. జడ్డూ 282 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటర్‌గా అశూ 3140 రన్స్ సాధిస్తే.. జడేజా 2920 పరుగులు చేశాడు.
పేస్ దళంలో వీరే
కోహ్లితో కలిసి.. భారత దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ 13 టెస్టులు ఆడి.. 38 వికెట్లు కూల్చాడు. భారత జట్టు యువ రక్తంతో నిండిపోతున్న తరుణంలోనూ తన మార్కు చూపించాడు.
ఇక మహ్మద్ షమీ.. కోహ్లితో కలిసి ఆడుతూ ఈ రైటార్మ్ పేసర్ 226 వికెట్లు పడగొట్టాడు. మరి జస్‌ప్రీత్ బుమ్రా ఈ జట్టులో లేకపోతే ఎలా?.. కోహ్లి కెప్టెన్సీలో రాటుదేలిన బుమ్రా 176 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
కోహ్లితో టెస్టులు ఆడిన అత్యుత్తమ భారత తుదిజట్టు ఇదే..
వీరేందర్ సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్.
చదవండి: CA: ఇష్టం లేకపోతే వెళ్లొద్దులే!