Nikhat Zareen: ఓనమాలు నేర్పిన విశాఖ.. ఇక్కడే మొదలైన ప్రస్థానం!

Nikhat Zareen: World Boxing Champion Bond With Visakhapatnam - Sakshi

 ప్రపంచ చాంప్‌ నిఖత్‌ ప్రస్థానం ఇక్కడే మొదలు

సంబరాలు  చేసుకుంటున్న  విశాఖ వాసులు 

విశాఖ స్పోర్ట్స్‌ : 2009లో ఓ బక్క పలుచని అమ్మాయి తండ్రి చేయిపట్టుకుని నిజమాబాద్‌లో బయలుదేరింది. పెద్ద కుటుంబం, ఆర్థికంగా వెనుకబడి ఉండటంతో తండ్రి బంధువు ప్రోత్సాహంతో సరదాగా నేర్చుకున్న బాక్సింగ్‌లో తర్ఫీదు పొందేందుకు విశాఖ చేరుకుంది. అప్పట్లో ఇక్కడి సాయ్‌ కోచింగ్‌ సెంటర్‌లోనే బాక్సింగ్‌ రెసిడెన్షియల్‌ కోచింగ్‌ కోసం ఎంపికలు ప్రారంభమయ్యాయి.

అందులో ప్రతిభ చూపి క్రీడా సంస్థలో శిక్షణకు ఎంపికైంది. తండ్రి పెళ్లిళ్లకు ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. శిక్షణతో పాటు మెరుగైన వసతులుండటంతో ఆ అమ్మాయిని విశాఖలో వదిలి తిరిగి నిజామాబాద్‌ చేరుకున్నాడు. బాక్సింగ్‌లో ఇక్కడే ఓనమాలు దిద్దిన ఆ అమ్మాయే నేడు ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌గా ఎదిగింది. ఆమే నిఖత్‌ జరీన్‌

2011లో జూనియర్‌ వుమెన్‌ ఇండియా కోచ్‌ వెంకటేశ్వర పర్యవేక్షణలో టర్కీలో జరిగిన జూనియర్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 51 కేజీల ఫ్లై వెయిట్‌ కేటగిరీలో తొలిసారిగా పాల్గొంది. తన పంచ్‌లతో ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించి స్వర్ణాన్ని సాధించింది. పంచ్‌లు విసరడంలో ప్రత్యర్థిని బట్టి పంథా మార్చుకునే విధానంలో ఉన్న ఆసక్తిని గమనించిన కోచ్‌ మరింతగా రాటుదేలేందుకు శిక్షణ ముమ్మరం చేశారు.

కోచ్‌గానే కాక ఎంపిక చేసిన జట్టును విదేశాల్లో టోర్నీలకు తీసుకెళ్లేది ఆయనే కావడంతో.. నిఖత్‌ వరసగా పతకాలు సాధించడంతో పాటు యూత్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌తో యూత్‌ ఒలింపిక్స్‌లో క్వాలిఫై అయ్యే స్థాయికి ఎదిగింది. 

పోలీస్‌ అవుదామనుకుంది  
అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీల్లో పతకాలు సాధిస్తూనే పోలీస్‌ కావాలనే ఉద్దేశంతో రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కాదనుకుంది. చివరికి బ్యాంక్‌లో ఉద్యోగంతో ఆర్థికంగా కుటుంబం నిలదొక్కుకోవడంతో సీనియర్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌పై దృష్టి పెట్టింది. అయితే అప్పటి వరకు 51 కేజీల ఫ్లై వెయిట్‌ కాస్త 52 కేజీల వెయిట్‌గా మారింది.  

లెఫ్ట్‌ హుక్‌తో పంచ్‌లు 
మానసికంగా దృఢంగా వుండే నిఖత్‌ రిస్క్‌ బౌట్‌ చేసి అగ్రెసివ్‌గా పంచ్‌లు విసరడంలో దిట్టగా మారింది. డైయాగ్నిల్‌ రైట్‌తో సడన్‌గా లెఫ్ట్‌ హుక్‌తో పంచ్‌లు విసిరి విజయాలను సొంతం చేసుకుంది. హుక్‌ మూవ్‌మెంట్‌తో ప్రత్యర్థి బలాల్ని రింగ్‌లోనే పసిగట్టి సమయానుకులంగా పంచ్‌ చేయడం, డూ ఆర్‌ డైగా ఎదుర్కొవడం జరీన్‌కు కలిసివచ్చింది.

గేమ్‌ను ఆస్వాదిస్తూనే ఉద్రేకపడకుండా కంబైన్డ్‌ అటాకింగ్‌తో నేడు ఏకంగా సీనియర్‌ ప్రపంచ బాక్సింగ్‌ చాంప్‌గా నిలిచింది. విశాఖలో శిక్షణ పొందేప్పుడే మిజోరాంకు చెందిన లాలంగివల్లి 48 కేజీల్లో, జరీనా 51 కేజీల్లో స్పారింగ్‌ చేస్తూ టర్కీల్లో జరిగిన పోటీల్లో స్వర్ణాలు సాధించారు.

 

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ 
జూనియర్, యూత్‌ స్థాయిలోనే సాయ్‌ సెంటర్స్‌లో శిక్షణ ఉంటుంది. సీనియర్‌ స్థాయిలో తలపడేందుకు ఎక్స్‌లెన్సీలో చేరడమే మంచిదని కోచ్‌ వెంకటేశ్వరరావు సలహాతో జిందాల్‌ ఎక్స్‌లెన్స్‌ అకాడమీకి చేరింది. అక్కడ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీలోనే కాంబినేషన్స్‌లో హుక్‌ చేయడం, పంచ్‌ విసరడం లాంటి టెక్నిక్స్‌తో ఏకంగా సీనియర్‌ వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌గా నిలిచింది.

తొలినాళ్లలో విశాఖలోనే నిఖత్‌ జరీన్‌ ప్రస్థానం ప్రారంభమై జూనియర్, యూత్‌ వుమెన్‌ బాక్సింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌.. నేడు సీనియర్స్‌ వరల్డ్‌కప్‌ బాక్సింగ్‌లో సత్తా చాటి దేశ ఖ్యాతిని ఇనుమడించే స్థితికి చేరుకుంది. ఆమె విజయంతో దేశ ప్రజలతో పాటు నగరవాసులు సంబరాలు జరుపుకుంటున్నారు.  

చదవండి👉🏾Nikhat Zareen On Commonwealth Games: ‘ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు’
👉🏾ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top