
బులవాయో (జింబాబ్వే): బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో... జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ మంచి స్థితిలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 92/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 96.1 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది.
డెవాన్ కాన్వే (170 బంతుల్లో 88; 12 ఫోర్లు), డారిల్ మిచెల్ (119 బంతుల్లో 80; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించగా... విల్ యంగ్ (70 బంతుల్లో 41; 4 ఫోర్లు), హెన్రీ నికోల్స్ (34; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రచిన్ రవీంద్ర (2), బ్లండెల్ (2), బ్రేస్‌వెల్ (9) విఫలమయ్యారు.
జింబాబ్వే బౌలర్లలో ముజర్‌బాని 3, చివాంగ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది.
బెనెట్ (18), బెన్ కరన్ (11) పెవిలియన్ చేరగా... నిక్ వెల్చ్ (2 బ్యాటింగ్), మసెకెసా (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ, రూర్కె చెరో వికెట్ పడగొట్టారు. చేతిలో 8 వికెట్లు ఉన్న జింబాబ్వే... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది.
చదవండి: IND vs ENG 5th Test: ఆధర్మసేన.. ఇంగ్లండ్‌కు ఫేవర్‌గా అంపైర్! ఫ్యాన్స్ ఫైర్