
లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా తడబడుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. నాయర్ 98 బంతుల్లో 52 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు.
అతడితో పాటు వాషింగ్టన్ సుందర్(19) క్రీజులో ఉన్నాడు. భారత బ్యాటర్లలో యశస్వి జైశ్వాల్(2), కేఎల్ రాహుల్(14), జడేజా(9), గిల్(21) నిరాశపరచగా.. సాయిసుదర్శన్(38) పర్వాలేదన్పించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, అట్కిన్సన్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. వోక్స్ ఓ వికెట్ సాధించారు.
అంపైర్‌పై ఫ్యాన్స్ ఫైర్..
భారత్ ఇన్నింగ్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంపైర్ కుమార ధర్మసేన వ్యవహారశైలి చర్చకు దారి తీసింది. 13వ ఓవర్ వేసిన టంగ్ భారత బ్యాటర్ సాయి సుదర్శన్‌కు యార్కర్ సంధించాడు. దానిని ఆడలేక సాయి కింద పడిపోయాడు.
బంతి ప్యాడ్స్‌కు తగలడంతో టంగ్ ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు. దీనిని ధర్మసేన తిరస్కరించడం వరకు ఓకే. కానీ అవుట్ కాదని చెబుతూనే అతను బంతి ముందే బ్యాట్‌కు తగిలినట్లుగా కూడా తన వేళ్లతో సైగ చేశాడు.
నిబంధనల ప్రకారం డీఆర్‌ఎస్ కోసం ఇచ్చే 15 సెకన్లు ముగిసే వరకు అంపైర్లు ఏ రీతిలో కూడా ఆటగాళ్లకు సహకరించే సంజ్ఞలు చేయరాదు. కానీ ధర్మసేన ఇలా చేయడం ఇంగ్లండ్‌కు పరోక్షంగా సహకరించినట్లయింది. తమ అప్పీల్‌పై నమ్మకం ఉంటే ఇంగ్లండ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లేది. నాటౌట్‌గా తేలితే జట్టు రివ్యూ కోల్పోయేది. అంపైర్ వ్యవహరించిన తీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి.
చదవండి: బుమ్రా ఎంత కాలం ఇలా..!