
మరో టెస్టుకు దూరమైన పేసర్
టెస్టు బౌలర్‌గా జస్‌ప్రీత్ బుమ్రాపై మరోసారి చర్చ మొదలైంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలకమైన టెస్టులో ఆడించకుండా ‘పని భారం’ పేరుతో అతడిని పక్కన పెట్టడం మళ్లీ అతని ఫిట్‌నెస్‌పై సందేహాలు రేకెత్తించింది. నిజానికి సిరీస్‌కు ముందే అతను మూడు టెస్టులు మాత్రమే ఆడతాడని టీమ్ మేనేజ్‌మెంట్ చేసిన ప్రకటనే తప్పు. ప్రతీ మ్యాచ్‌కు ముందు పరిస్థితిని బట్టి తుది జట్టును ఎంపిక చేసే సమయంలో నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ‘మూడే టెస్టులు’ అంటూ మళ్లీ మళ్లీ చెప్పడం అర్థరహితం. అలా ప్రకటించినా... పేస్, స్వింగ్‌కు అనుకూలంగా ఉన్న ఓవల్ పిచ్‌పై అతను ఆడతాడని అంతా భావించారు.
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో నాలుగు, ఐదు రోజుల్లో బుమ్రాకు బౌలింగ్ చేయాల్సిన అవసరం రాలేదు. మూడు రోజుల విరామం కలిపితే ఐదు రోజుల పాటు అతని పూర్తి విశ్రాంతి లభించింది. లీడ్స్‌తో మొదటి టెస్టు, బరి్మంగ్‌హామ్‌లో రెండో టెస్టుకు మధ్య ఏడు రోజుల వ్యవధి వచ్చినా బుమ్రాను ఆడించకపోవడాన్ని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు తప్పు పట్టగా, ఇప్పుడు అదే పునరావృతమైంది. బుమ్రా అత్యద్భుత బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒంటి చేత్తో అతను జట్టుకు విజయాలు అందించాడు.
48 టెస్టుల కెరీర్‌లో 35 టెస్టుల్లో విదేశాల్లోనే ఆడి కేవలం 20 సగటుతో 172 వికెట్లు పడగొట్టిన రికార్డు అతని సొంతం. అయితే ఇలా అప్పుడప్పుడు ఆడుతూ 31 ఏళ్ల బుమ్రా ఎంత కాలం టెస్టు కెరీర్‌ను కొనసాగించగలడనేదే చర్చనీయాంశం. టెస్టుల్లో అతను రిటైర్ కావడం మంచిదనే సూచనలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అతను పూర్తిగా తప్పుకోవడంకంటే ఇదే తరహాలో వ్యూహాత్మకంగా వాడుకోవడం సరైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా చెప్పాలంటే బుమ్రాను నమ్ముకొని మ్యాచ్‌లు గెలవాలనుకునే ఆలోచనను టీమ్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టాల్సిందే.
అతను అందుబాటులో ఉంటే మంచిదే కానీ లేకపోయినా అన్ని రకాలుగా సిద్ధం కావడం సరైన ప్రణాళిక అవుతుంది. ఇతర బౌలర్లతో పోలిస్తే బుమ్రా తక్కువ ఓవర్లు ఏమీ వేయలేదు. ఆ్రస్టేలియా సిరీస్‌లో 151.2 ఓవర్లు వేసిన అతను...ప్రస్తుత సిరీస్‌లో మూడు టెస్టుల్లో 5 ఇన్నింగ్స్‌లోనే 119.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతని భిన్నమైన బౌలింగ్ శైలితోనే సమస్య. అదే అతని వెన్నుభాగంపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది.
బౌలింగ్ సమయంలో శరీరాన్ని ఒక వైపు వంచే ‘లేటరల్ ఫ్లెక్సియాన్’తో అతను ఇంత కాలం కొనసాగడమే గొప్ప. నిజానికి ఈ సిరీస్‌లో అతను ఆడిన మూడు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లలో 140 కిలోమీటర్లకు పైగా వేసిన బంతుల శాతం 42.7 నుంచి 22.3కి, ఆపై 0.5 శాతానికి తగ్గుతూ వచ్చింది. మాంచెస్టర్‌లో ఇన్నింగ్స్‌లో 33 ఓవర్లు వేసిన బుమ్రా తొలిసారి 100కు పైగా పరుగులు ఇచ్చాడు. కాబట్టి అతడిని ఓవల్‌లోనూ ఆడిస్తే సమస్య తీవ్రంగా మారేదేమో! ఇలాంటి స్థితిలో బుమ్రాకు విరామాలు ఇవ్వడంలో తప్పు లేదనేది మేనేజ్‌మెంట్ వాదన.
– సాక్షి క్రీడా విభాగం