Ind Vs Pak: ఊహించని ట్విస్టు.. ఓపెనర్లుగా గిల్‌, ఇషాన్‌! పిచ్చి ప్రయోగం! | New Role for Rohit? Captain Pairs With Shreyas Iyer In Asia Cup Camp: Report - Sakshi
Sakshi News home page

Asia Cup: ఊహించని ట్విస్టు.. ఓపెనర్లుగా గిల్‌, ఇషాన్‌! మరి రోహిత్‌? అయ్యర్‌ సంగతేంటి?

Published Mon, Aug 28 2023 9:31 PM

New Role for Rohit Captain Pairs With Shreyas Iyer in Asia Cup Camp: Report - Sakshi

ఆసియా కప్‌-2023 ఆరంభానికి సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌ వేదికగా ఆగష్టు 30న ఈ వన్డే టోర్నీ మొదలుకానుంది. గ్రూప్‌-ఏలో భాగమైన ఆతిథ్య పాక్‌- నేపాల్‌ జట్ల మధ్య పోరుతో ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈ క్రమంలో శ్రీలంకలోని పల్లెకెలెలో సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ​ఈ నేపథ్యంలో ఇప్పటికే బీసీసీఐ 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే.

వాళ్లిద్దరి పునరాగమనం.. కానీ
యువ ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ ఇద్దరికీ ఈ జట్టులో చోటు దక్కింది. ఇక మిడిలార్డర్‌లో కీలకమైన శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. రాహుల్‌ ఇప్పటికీ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌కు ఛాన్స్‌ దక్కింది. మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు.

అయ్యర్‌కు పార్ట్‌నర్‌గా
ఇదిలా ఉంటే.. ఆసియా కప్‌ నేపథ్యంలో కర్ణాటకలోని ఆలూరులో బీసీసీఐ ఆటగాళ్లకు ట్రెయినింగ్‌ క్యాంపు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. శ్రేయస్‌ అ‍య్యర్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయడం ఆసక్తిని కలిగించింది.

మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానం విషయంలో టీమిండియా గత కొన్నేళ్లుగా సమస్య ఎదుర్కొంటోందని రోహిత్‌ ఇది వరకే అంగీకరించిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా అయ్యర్‌ నంబర్‌ 4లో రాణిస్తున్నా గాయం కారణంగా సుదీర్ఘ కాలం పాటు జట్టుకు దూరం కావడం తీవ్ర ప్రభావం చూపింది.

గిల్‌ అయితే ఫిక్స్‌
ప్రస్తుతం ఆసియా కప్‌.. ఆ తర్వాత వన్డే వరల్డ్‌కప్‌-2023 వంటి మెగా ఈవెంట్ల నేపథ్యంలో.. శ్రేయస్‌ అయ్యర్‌కు గనుక గాయం తిరగబెడితే పరిస్థితి ఏంటన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ సహా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిల్లియర్స్‌..నంబర్‌ 4 లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి కరెక్ట్‌ అని అభిప్రాయపడుతున్నారు.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ నాటికి రాహుల్‌ గనుక అందుబాటులో లేకుంటే.. ఇషన్‌ కిషాన్‌ను జట్టులో చోటు ఖాయమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, అతడిని ఏ స్థానంలో ఆడించాలన్నదే ప్రశ్న. ఓపెనర్‌గా వన్డేల్లో ఇషాన్‌కు మంచి రికార్డు ఉంది. అయితే, 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఇప్పటికే రోహిత్‌ శర్మకు జోడీగా శుబ్‌మన్‌ గిల్‌ స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

ఇలా అయితే ఎలా ఉంటుంది?
ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా ఎవరిని పంపాలి? కీలకమైన నాలుగో స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలన్న అంశంపై రాహుల్‌ ద్రవిడ్‌, రోహిత్‌ మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గిల్‌, ఇషాన్‌లతో ఓపెనింగ్‌ చేయించి.. వన్‌డౌన్‌లో కోహ్లి యథాతథంగా వచ్చి.. నాలుగో స్థానంలో రోహిత్‌ను ఆడిస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మేనేజ్‌మెంట్‌ ఉన్నట్లు తాజా సమాచారం. రాహుల్‌ అందుబాటులో ఉండకపోవచ్చని చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ ఇప్పటికే స్పష్టం చేసిన క్రమంలో అయ్యర్‌ను ఐదోస్థానానికి డిమోట్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పిచ్చి ప్రయోగాలతో కొంప మునగడం ఖాయం
ఈ నేపథ్యంలో ఓపెనర్లుగా శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌.. ఆ తర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, శ్రేయస్‌ అయ్యర్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌ వస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి .ఇదే గనుక నిజమైతే పిచ్చి ప్రయోగాలతో కొంప మునగడం ఖాయమని అభిమానులు ఉసూరుమంటున్నారు.

ట్రెయినింగ్‌ సెషన్‌లో రోహిత్‌, అయ్యర్‌ ఇలా..
పాక్ స్టార్‌ పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిదిని ఎదుర్కొనే సన్నాహకాల్లో భాగంగా లెఫ్టార్మ్‌ సీమర్‌ యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో రోహిత్‌, గిల్‌, అయ్యర్‌ ప్రాక్టీస్‌ చేసినట్లు సమాచారం. టీమిండియా ప్రధాన పేసర్‌ బుమ్రా, యశ్‌ దయాల్‌ల బౌలింగ్‌ తర్వాత రోహిత్‌, అయ్యర్‌తో కలిసి స్పిన్నర్లు సాయి కిషోర్‌, రాహుల్‌ చహర్‌, రవీంద్ర జడేజాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది.

ఇక ట్రెయినింగ్‌ సెషన్‌లో ఈ ముగ్గురూ స్వీప్‌షాట్లు ఎక్కువగా ప్రాక్టీస్‌ చేసినట్లు సమాచారం. ఆసియా కప్‌ క్యాంప్‌ డే 4లో భాగంగా ఇషాన్‌ కిషన్‌ వికెట్‌ కీపర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement