మొయిన్ అలీ (PC: X)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అమ్ముడుపోని విదేశీ క్రికెటర్లలో చాలా మంది పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)లో చేరతారు. ఒకవేళ మళ్లీ ఐపీఎల్ నుంచి గనుక ఆఫర్ వస్తే భారత్‌కు వచ్చేస్తారు. తాజా ఎడిషన్‌లో జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్‌బానీ, శ్రీలంక కెప్టెన్ దసున్ షనక, ఆస్ట్రేలియా స్టార్ స్పెన్సర్ పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరారు.
నాకిప్పుడు 38 ఏళ్లు
అయితే, తాను మాత్రం ఈ కోవకు చెందినవాడిని కాదంటున్నాడు ఇంగ్లండ్ వెటరన్ క్రికెటర్ మొయిన్ అలీ (Moeen Ali). తాను కావాలనే IPLను కాదని PSLను ఎంచుకున్నట్లు తెలిపాడు. ‘‘నాకిప్పుడు 38 ఏళ్లు. అయినప్పటికీ నేనింకా క్రికెట్ ఆడాలనే అనుకుంటున్నాను. వీలైనంతగా నా కెరీర్‌ను పొడిగించుకోవాలని భావిస్తున్నాను.
షార్ట్‌టైమ్ టోర్నీ
కరాచీ కింగ్స్‌లో నాకు ఈ స్వేచ్ఛ దొరికింది. ముఖ్యంగా పీఎస్‌ఎల్ తక్కువ వ్యవధిలోనే ముగిసిపోయే టోర్నీ. కాబట్టి ఆటగాడిగా నా లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూనే కుటుంబానికి తగిన సమయం కేటాయించే వీలు దొరుకుతుంది.
గతేడాది నేను ఐపీఎల్‌లో ఆడాను. అయితే సగం మ్యాచ్‌లలో కూడా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. బహుశా రెండుసార్లు నేను బ్యాటింగ్ చేసి ఉంటాను. నిజానికి నాకు బ్యాటింగ్ చేయడం ఇష్టం. నా కెరీర్ చరమాంకంలోనూ ఎక్కువగా బ్యాటింగ్ చేయాలని కోరుకుంటున్నా.
అయితే, ఏ జట్టులోనైనా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటుకు గ్యారెంటీ ఉండదు. పీఎస్‌ఎల్‌లో కూడా అంతే. అయితే, ఆటను వీలైనంతగా ఆస్వాదించాలని భావిస్తున్నా. ఒక్కసారైనా పీఎస్‌ఎల్ ఆడాలని అనుకున్నా.
షెడ్యూల్ క్లాష్
కానీ.. దురదృష్టవశాత్తూ ఐపీఎల్‌తో పీఎస్‌ఎల్ షెడ్యూల్ క్లాష్ అవుతోంది. అందుకే ఈ సారి ఐపీఎల్‌కు దూరమయ్యాను’’ అని మొయిన్ అలీ తన నిర్ణయానికి గల కారణాలు వెల్లడించాడు.
కాగా ఐపీఎల్- 2025 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీని రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఈ ఏడాది పీఎస్‌ఎల్‌లో కరాచీకి ఆడుతున్న అతడు రూ. 2 కోట్లకు పైగా జీతం అందుకుంటున్నాడు.
కాగా ఈ సీజన్‌లో అతడు ఇప్పటికి 126 పరుగులు చేసి.. మూడు వికెట్లు తీయగలిగాడు. ఇక 2024లో మొయిన్ అలీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.


