చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి | Varun Chakaravarthy Scripts Historic IPL Record For KKR | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన వరుణ్‌ చక్రవర్తి

Apr 18 2026 7:48 AM | Updated on Apr 18 2026 8:56 AM

Varun Chakaravarthy Scripts Historic IPL Record For KKR

ఐపీఎల్‌ 2026లో కేకేఆర్‌ మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి చరిత్ర సృష్టించాడు. తన ఫ్రాంచైజీ చరిత్రలో 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా చారిత్రక ఘనత సాధించాడు. నిన్న (ఏప్రిల్‌ 17) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు తీయగా.. అందులో మొదటి వికెట్‌తోనే ఈ ఘనత సాధించాడు. 

జోస్‌ బట్లర్‌ వికెట్‌ వరుణ్‌కు ఐపీఎల్‌లో 100వ వికెట్‌. వరుణ్‌ కాకుండా కేకేఆర్‌ తరఫున 100 వికెట్లు తీసిన బౌలర్లుగా సునీల్‌ నరైన్‌ (214), ఆండ్రీ రసెల్‌ (124) ఉన్నారు. వీరిద్దరూ విదేశీ క్రికెటర్లే. వరుణ్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో (పంజాబ్‌, కేకేఆర్‌ తరఫున) ఇప్పటివరకు 87 మ్యాచ్‌లు ఆడి అందులో 102 వికెట్లు (పంజాబ్‌ తరఫున ఒకటి) తీశాడు. 

తద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పంజాబ్‌ పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌తో కలిసి సంయుక్తంగా 28వ స్థానంలో ఉన్నారు. స్పిన్నర్ల విభాగంలో 11వ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా ఉన్నాడు.

దారుణ ఫామ్‌
వరుణ్‌ గత కొంతకాలంగా దారుణమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్‌ రెండో అర్దభాగంలో మొదలైన పేలవ ప్రదర్శన గుజరాత్‌ మ్యాచ్‌ ముందు వరకు కొనసాగింది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో వరుణ్‌ తొలి 3 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. పైగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. గుజరాత్‌ మ్యాచ్‌తోనే అతను వికెట్ల ఖాతా తెరిచాడు. ఈ మ్యాచ్‌లో వరుణ్‌ ఓ మోస్తరు ప్రదర్శన (4-0-34-2) చేసినప్పటికీ కేకేఆర్‌ ఓటమిపాలైంది.

కోల్‌'కథ' కంచికే..!
వరుణ్‌ ఫ్రాంచైజీ కేకేఆర్‌ ఈ సీజన్‌లో ఘోర ప్రదర్శనలు చేస్తుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఏకంగా 5 పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో ఉంది. ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోల్‌'కథ' కంచికి చేరినట్లే.

తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేస్తూ.. గ్రీన్‌ (79) సీజన్‌లో తొలి సారి రాణించడంతో 180 పరుగులు చేసిన కేకేఆర్‌.. ఆతర్వాత లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. శుభ్‌మన్‌ గిల్‌ (86) సత్తా చాటి గుజరాత్‌ను గెలిపించాడు. గుజరాత్‌ మరో 2 బంతులు మిగిలుండగానే సగం వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్‌ తమ తదుపరి మ్యాచ్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement