
తొలి రౌండ్‌లోనే ఓడిన ప్రణయ్
ఉన్నతి, ఆకర్షి కూడా నిష్క్రమణ
మకావు: మకావు ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నేపల్లి, పారిస్ ఒలింపియన్ లక్ష్య సేన్, ఆయుశ్ శెట్టి శుభారంభం చేసి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... హెచ్‌ఎస్ ప్రణయ్, మన్‌రాజ్ సింగ్, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్, కిరణ్ జార్జి, సతీశ్ కుమార్ కరుణాకరన్, రిత్విక్ తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.
తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో తరుణ్ 21–19, 21–13తో సహచరుడు మన్‌రాజ్ సింగ్‌పై, లక్ష్య సేన్ 21–8, 21–14తో జియోన్ హైయోక్ జిన్ (దక్షిణ కొరియా)పై, ఆయుశ్ 21–10, 21–11తో హువాంగ్ యు కాయ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించారు.
ప్రపంచ 33వ ర్యాంకర్ ప్రణయ్ 21–18, 15–21, 16–21తో ప్రపంచ 75వ ర్యాంకర్ యోహానెస్ మార్సెలినో (ఇండోనేసియా) చేతిలో... శంకర్ 18–21, 14–21తో హు జె ఆన్ (చైనా) చేతిలో... కిరణ్ జార్జి 15–21, 10–21తో ఎన్జీ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో... సతీశ్ కుమార్ 19–21, 12–21తో జస్టిన్ హో (మలేసియా) చేతిలో, రిత్విక్ 16–21, 8–21తో చికో వర్దాయో (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు.
రక్షిత శ్రీ సంచలనం
మహిళల సింగిల్స్‌లో ఆరుగురు భారత క్రీడాకారిణులు బరిలోకి దిగగా... రక్షిత శ్రీ మినహా మిగతా ఐదుగురు తొలి రౌండ్‌లోనే వెనుదిరిగారు. తొలి రౌండ్‌లో రక్షిత శ్రీ 63 నిమిషాల్లో 18–21, 21–17, 22–20తో ప్రపంచ 35వ ర్యాంకర్ పోర్న్‌పిచా చోయికివోంగ్ (థాయ్‌లాండ్)ను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఉన్నతి హుడా 21–16, 19–21, 17–21తో జూలీ జేకబ్సన్ (డెన్మార్క్) చేతిలో, తస్నీమ్ మీర్ 6–21, 14–21తో టాప్ సీడ్ చెన్ యు ఫె (చైనా) చేతిలో, ఆకర్షి కశ్యప్ 14–21, 16–21తో ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో, అనుపమ 16–21, 10–21తో రికో గుంజి (జపాన్) చేతిలో, అన్‌మోల్ 21–23, 11–21తో బుసానన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు.
రుత్విక జోడీకి నిరాశ
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ ప్లేయర్ గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీకి నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో రుత్విక శివాని–రోహన్ ద్వయం 20–22, 17–21 తో వు గువాన్ జున్–లీ చియా సిన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) జంట ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంది. తొలి రౌండ్‌లో తనీషా–ధ్రువ్ ద్వయం 21–10, 21–15తో రచాపోల్–నత్తమోన్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గింది.
ఇతర మ్యాచ్‌ల్లో హేమనాగేంద్ర బాబు–ప్రియ (భారత్) 11–21, 14– 21తో ఫువానత్–ఫుంగ్‌ఫా (థాయ్‌లాండ్) చేతిలో ... సతీశ్–ఆద్య (భారత్) 18–21, 21– 23 తో అమ్రీ–నితా (ఇండోనేసియా) చేతి లో... ఆయుశ్ –శ్రుతి (భారత్) 10–21, 11– 21 తో రెహాన్–గ్లోరియా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు.