వెల్‌డన్‌ నోరిస్‌ | McLaren driver wins Austrian Grand Prix | Sakshi
Sakshi News home page

వెల్‌డన్‌ నోరిస్‌

Jun 30 2025 2:35 AM | Updated on Jun 30 2025 2:35 AM

McLaren driver wins Austrian Grand Prix

ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి విజేతగా మెక్‌లారెన్‌ డ్రైవర్‌

సీజన్‌లో మూడో విజయం నమోదు

సహచరుడు పియాస్ట్రికి రెండో స్థానం   

స్పీల్‌బర్గ్‌ (ఆ్రస్టియా): ఫార్ములావన్‌ తాజా సీజన్‌లో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ లాండో నోరిస్‌ తన ఖాతాలో మూడో విజయం జమ చేసుకున్నాడు. 2025 సీజన్‌లో 11వ రేసుగా ఆదివారం జరిగిన ఆ్రస్టియా గ్రాండ్‌ప్రిలో నోరిస్‌ విజేతగా నిలిచాడు. నిర్ణీత 70 ల్యాప్‌లను నోరిస్‌ అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా ఒక గంట 23 నిమిషాల 47.693 సెకన్లలో ముగించి అగ్రస్థానం దక్కించుకున్నాడు. మెక్‌లారెన్‌ జట్టుకే చెందిన ఆస్కార్‌ పియాస్ట్రి ఒక గంట 23 నిమిషాల 50.388 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. 

చివరగా జరిగిన కెనడా గ్రాండ్‌ప్రిలో ఈ ఇద్దరి కార్లు పరస్పరం ఢీకొనగా... తాజా రేసులో వీరి మధ్య ఆద్యంతం రసవత్తర పోటీ సాగింది. అయితే ఆఖర్లో వేగం పెంచిన నోరిస్‌ టైటిల్‌ హస్తగతం చేసుకున్నాడు. తద్వారా డ్రైవర్స్‌ ప్రపంచ చాంపియన్‌షి ప్‌ సాధించే దిశగా ముందడుగు వేశాడు. ‘మా ఇద్దరి మధ్య గట్టి పోటీ సాగింది. తొలి రెండు స్థానాల్లో నిలవడం ఆనందంగా ఉంది’ అని రేసు అనంతరం నోరిస్‌ అన్నాడు. 

ఫెరారీ డ్రైవర్‌ చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (1 గంట 24 నిమిషాల 7.513 సెకన్లు) మూడో స్థానంలో నిలవగా... ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ (1 గంట 24 నిమిషాల 16.713 సెకన్లు; ఫెరారీ) నాలుగో స్థానంలో, రసెల్‌ (1 గంట 24 నిమిషాల 50.089 సెకన్లు; మెర్సిడెస్‌) ఐదో స్థానంలో నిలిచారు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ రేసును పూర్తి చేయలేకపోయాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొన్న ఈ రేసులో 16 మంది మాత్రమే రేసు పూర్తిచేశారు. 

24 రేసుల తాజా సీజన్‌లో ఇప్పటి వరకు 11 రేసులు ముగిశాయి. డ్రైవర్స్‌ చాంపియన్‌షి ప్‌లో 216 పాయింట్లతో ప్రియాస్ట్రి అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా... 201 పాయింట్లతో నోరిస్‌ రెండో స్థానంలో, 155 పాయింట్లతో వెర్‌స్టాపెన్‌ మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు బ్రిటన్‌ గ్రాండ్‌ప్రి జూలై 6న జరుగుతుంది. మరోవైపు ఫార్ములావన్‌ షెడ్యూల్‌లో 2041 వరకు ఆ్రస్టియా గ్రాండ్‌ప్రి కొనసాగనుంది. ఈ మేరకు ఆదివారం ఫార్ములావన్‌ నిర్వాహకులు వివరాలు వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement