Matthew Wade: క్యాన్సర్‌ బారిన పడ్డ మాథ్యూ వేడ్.. ప్లంబర్‌గా, కార్పెంటర్‌గా.. చివరకు...

Matthew Wade Beat Testicular Cancer at 16 Worked as Carpenter - Sakshi

Matthew Wade Beat Testicular Cancer at 16 Worked as Carpenter: మాథ్యూ వేడ్.. ఈ పేరు క్రికెట్‌ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీ20 ప్రపంచకప్‌-2021లో సెమీ ఫైనల్‌లో  షాహీన్ షా అఫ్రిదీ బౌలింగ్‌లో వరుసుగా మూడు సిక్సర్‌లు బాది పాకిస్తాన్‌ ఫైనల్‌ ఆశలు గల్లంతు చేసిన కంగారూ బ్యాటర్‌. తన సంచలన ఇన్నింగ్స్ తో వేడ్ ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు. ఇప్పటికీ పాకిస్తానీ అభిమానులు ఈ ఓటమిని జీర్ణీంచుకోలేకపోతున్నారు.

పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఈ ఆసీస్‌ హీరో.. తన నిజ జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి చేరుకున్నాడు. 16 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్‌ను జయించిన మృత్యుంజయుడు వేడ్. అతను ఒక స్టార్‌ క్రికెటర్‌ గానే మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ పొట్టకూటి కోసం కార్పెంటర్‌గా, ప్లంబర్‌గా వేడ్‌ పని చేశాడనే విషయం మీకు తెలుసా? ఆసీస్‌కు వేడ్‌ అనూహ్య విజయాన్ని అందించిన నేపథ్యంలో అతనికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.

16 ఏళ్ల వయసులో క్యాన్సర్..
మాథ్యూ వేడ్‌కు అప్పుడు 16 ఏళ్లు.. ఓ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆడుతుండగా అతడు  గజ్జ గాయానికి గురయ్యాడు. ఈ క్రమంలో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. ఒక భయంకర వార్త అతనికి తెలుస్తుంది. అదే అతడు  క్యాన్సర్‌ బారిన పడ్డాడని. తర్వాత  కీమోథెరపీతో చికిత్స పోందుతూనే తన శిక్షణను కొనసాగించాడు. ఈ మాటలు స్వయానా అతడే సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

కొన్నాళ్లు ప్లంబర్‌గా...
క్యాన్సర్‌కు  చికిత్స పొందుతున్నప్పడు అతడి క్రీడా జీవితం ప్రశ్నార్థకంలో పడింది. ఈ క్రమంలో ప్లంబర్‌గా అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఏళ్లు ప్లంబర్‌గా పని చేశాడు. అయితే చికిత్స సమయంలో శారీరకంగా బలహీనంగా ఉన్నానని,  జుట్టు లేకుండా తొటి వాళ్లతో తిరగడానికి చాలా ఇబ్బంది పడ్డానని వేడ్ ఇంటర్వ్యూలో తెలిపాడు.

వర్ణాంధత్వం..
మాథ్యూ వేడ్‌కు వర్ణాంధత్వం కూడా ఒక సమస్యగా ఉండేది. ముఖ్యంగా పింక్ బాల్‌తో డే అండ్ నైట్ క్రికెట్‌లో వర్ణాంధత్వం వల్ల అనేక సమస్యలను అతడు ఎదుర్కొన్నాడు. "కొన్ని సమయాల్లో బంతి ఎలా  వస్తుందో చూడడానికి  కొంచెం కష్టంగానే ఉండేది..అదే విధంగా ఆస్ట్రేలియా మాజీ టెస్ట్ ఓపెనర్ క్రిస్ రోజర్స్ కూడా వర్ణాంధత్వంతో బాధపడ్డాడు. దీంతో  2014లో ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో  పింక్-బాల్ మ్యాచ్ నుంచి రోజర్స్  వైదొలిగాడు "అని వేడ్ చెప్పుకొచ్చాడు.


 
కార్పెంటర్‌గా..
ఫామ్‌ లేమి కారణంగా 2018లో అతడు జాతీయ జట్టుకు దూరమైనప్పడు  కార్పెంటర్‌గా అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌ తీసుకున్నాడు. 9-10 నెలలు తన ఇంటిలోనే కార్పెంటర్‌గా పనిచేశాడు. దీనిపై స్పందించిన వేడ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను జట్టుకు దూరమైనా చాలా విషయాలు నేర్చుకోవడం వైపు అడుగులు వేశాను. నేను వారానికి మూడు రోజులు కార్పెంటర్‌గా పని చేసాను, మిగితా రోజులు నా ఫ్యామిలితో గడిపాను. అయితే, నా క్రికెట్‌ జీవితాన్ని కొంత కాలం పాటు కోల్పోయాను.

కార్పెంటర్‌గా పనిచేయడంతో సాధారణ జీవితాన్ని ఎలా గడపాలో తెలుసుకున్నాను. గుంతలు తవ్వడం, బోరింగ్ కాంక్రీట్ వంటి పనుల్లో ప్రజలు ఎంత కష్టపడతున్నారో చూశాను. నేను ప్రస్తుతం  క్రికెట్ ఫీల్డ్‌లో ఉన్నానడంలో  ఇవన్నీ కీలకమైన పాత్ర పోషించాయి’ అని వేడ్‌ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.

అతడి కెరీర్‌ వెనుక జూలియా
మాథ్యూ వేడ్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం వెనుక అతడి భార్య జూలియా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే..  యాషెస్‌ సిరీస్‌కు ముందు అతడిని ఆస్ట్రేలియా- ఎ జట్టుకు ఎంపిక చేశారు. అయితే అదే సమయంలో అతడి భార్య గర్భవతిగా ఉంది.  ఈ క్రమంలో తన భార్య జూలియాకు ఫోన్ చేసి.. నాకు ఈ పర్యటనకు వెళ్లడం ఇష్టం  లేదని సెలెక్టర్లకు తెలియజేస్తానని అతడు చెప్పాడు.

కానీ అతడి భార్య దానికి భిన్నంగా స్పందించింది. మీరు తప్పనిసరిగా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లాలని, ఎందుకంటే మీ స్ధానంలో వేరొకరిని ఎంపిక చేస్తారు. మీరు ఈ అవకాశం కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇంత కష్టపడి వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం చాలా బాధకరమైన విషయమని వేడ్‌కు ఆమె సర్దిచెప్పింది. ఆమె ఇచ్చిన పోత్సాహంతో వేడ్‌ ఆస్ట్రేలియా-ఎ తరపున ఇంగ్లండ్‌ బయల్దేరి వెళ్లాడు. తదనంతరం మెరుగ్గా రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన సక్సెస్‌ వెనుక భార్య జూలియా పాత్ర మరువలేనిదని చాలా ఇంటర్వ్యూల్లో వేడ్‌ పేర్కొన్నాడు.

చదవండి: 'కోహ్లి అన్ని ఫార్మాట్లలో కెప్టెన్‌గా తప్పుకుంటే మంచిది'.. లేదంటే: అఫ్రిది
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top