ఢిల్లీ.. 2000 సంవత్సరం.. విమాన ప్రయాణం.. ఆమె లగేజీ, డాక్యుమెంట్లు పోయాయి.. ఇంతలో అతడు వచ్చాడు.. ఆమెకు సాయం చేశాడు.. ఇద్దరి మాటలు కలిశాయి.. మనసులు కలవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఐదేళ్ల స్నేహం తర్వాత 2005లో ఆ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.
వారి దాంపత్యానికి గుర్తుగా 2007లో కవల కుమారులు జన్మించారు. 2013లో మరో కుమారుడు.. 2018లో ఓ ఆడబిడ్డను దత్తత తీసుకున్నారు. వారిద్దరు వారికి నలుగురు.. చక్కటి సంసారం. ఆమె భారత దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్. అతడు కరుంగ్ ఓన్‌కోలర్.. ఫుట్‌బాల్ ఆటగాడు. న్యాయవాది కూడా!
బాక్సర్‌గా భార్య ఎదుగుదల కోసం తన కెరీర్‌ను పణంగా పెట్టానంటాడు కరుంగ్. మేరీ సైతం గతంలో భర్త ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చానని చెప్పింది. అయితే, విధికి కన్నుకుట్టిందో ఏమో.. 2013 నుంచి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. చినికి చినికి గాలివానలా మారి వ్యవహారం విడాకుల దాకా వచ్చింది.
వివాహేతర సంబంధం మచ్చ
కోమ్ చట్టాల ప్రకారం తాము విడిపోయినట్లు మేరీ కోమ్ గతేడాది ఓ ప్రకటన విడుదల చేసింది. ఓన్‌కోలర్‌తో విడిపోయినట్లు తన న్యాయవాది ద్వారా ప్రకటన చేసింది. ఇక అప్పటి నుంచి ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయి ఎందరికో ఆదర్శంగా నిలిచిన మేరీ కోమ్ వ్యక్తిత్వంపై వివాహేతర సంబంధం మచ్చ పడింది.
అయితే, ఈ విషయం గురించి ఓన్‌కోలర్ నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ తన గురించి మేరీ లోక్ అదాలత్‌లో మోసగాడు అని ముద్ర వేసిన తర్వాతే తాను అసలు విషయం చెప్పాల్సివస్తోందంటూ అతడు సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల మాట్లాడుతూ.. 2013లో ఓ జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు వివాహేతర సంబంధం ఉండేదని అతడు ఆరోపించాడు.
సాక్ష్యంగా మెసేజ్‌లు
ఆ తర్వాత రాజీ పడినా.. 2017లో మరో వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగించిందని ఓన్‌కోలర్ ఆరోపణలు చేశాడు. వాళ్లిద్దరి సంబంధానికి సాక్ష్యంగా తన వద్ద వాట్సాప్ మెసేజ్‌లు ఉన్నాయని తెలిపాడు. ఆమెను తాను మోసం చేశానని.. ఆస్తి కొట్టేశానని మేరీ కోమ్ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా అతడు ఈ మేరకు సమాధానం ఇచ్చాడు.
మేరీ కోమ్ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని.. అయితే, తనపై అభాండాలు వేస్తే మాత్రం ఊరుకునేది లేదన్నాడు. ఆధారాలు ఉంటేనే తన గురించి మాట్లాడాలని మేరీ కోమ్‌కు హితవు పలికాడు. కాగా 2022లో తాను గాయపడినపుడు ఓన్‌కోలర్ నిజ స్వరూపం బయటపడిందని మేరీ కోమ్ ఇటీవల తెలిపింది.
తాను పోటీలలో పాల్గొని సంపాదించినంత వరకు అంతా సజావుగా సాగిందని.. ఎప్పుడైతే తాను గాయపడ్డానో అప్పటి నుంచి తానొక భ్రమలో బతుకుతున్న విషయం స్పష్టంగా తెలిసిందని వాపోయింది.
సంపాదన లేకుండా నాపై ఆధారపడి
అప్పుడే తనకు నిజం తెలిసిందని.. అందుకే భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు మేరీ కోమ్ తెలిపింది. అంతేకాదు.. తన దగ్గర కోట్ల రూపాయలు కాజేసి.. భూమి కొనుకున్నాడని.. మణిపూర్‌లోని తన ఆస్తిపై లోన్లు తెచ్చుకున్నాడని ఆరోపించింది. తాను ఇలా మాట్లాడినందుకు కొంతమంది తనను దురాశ కలిగిన వ్యక్తిగా అభివర్ణిస్తున్నారని.. తనకు ఏడ్చే వెసలుబాటు కూడా లేదా అని ఆవేదన వ్యక్తం చేసింది.
తాను కష్టపడి బాక్సింగ్ ద్వారా కుటుంబాన్ని పోషిస్తే.. అతడు మాత్రం ఎలాంటి సంపాదన లేకుండా తనపై ఆధారపడి బతికేవాడని మేరీ కోమ్ మాజీ భర్తపై మండిపడింది. తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతాలోని డబ్బులను ఖాళీ చేశాడని ఆరోపించింది. ఇందుకు ఓన్‌కోలర్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.
పిల్లలకు తల్లినయ్యాను
పెళ్లికి ముందు తాను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఉండేవాడినని.. అయితే, మేరీ కోమ్ కోసం తాను తన కెరీర్‌నే వదులుకున్నానని పేర్కొన్నాడు. ఆమె బాక్సింగ్‌తో బిజీగా ఉంటే.. తానే పిల్లల్ని పెంచి పెద్ద చేశానని.. ఇంటి బాధ్యతలు చూసుకున్నానని చెప్పుకొచ్చాడు.
పిల్లలకు స్నానం చేయించడం దగ్గర నుంచి అన్నీ తానే చేసేవాడినని.. తల్లిలా వారిని పెంచానని గుర్తు చేసుకున్నాడు. అలాంటిది ఇప్పుడు తనను కనీసం పిల్లల్ని కూడా చూడనివ్వడం లేదంటూ ఆవేదన చెందాడు. మేరీ కోమ్, పిల్లల మీద ప్రేమతో మాత్రమే ఇవన్నీ చేశానని.. తనకు డబ్బు, పేరు అక్కర్లేదని పేర్కొన్నాడు.
సంపాదనలేని భర్త వద్దా? భార్యే నా ATM?
మేరీ కోమ్- ఓన్‌కోలర్ వివాదంలో కొంతమంది ఆమెకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు అతడికి సపోర్టు చేస్తున్నారు. భార్యను ప్రోత్సహించిన భర్తకు సంపాదన లేదన్న కారణం చూపి అవమానించడం సరికాదని కొందరు అంటుంటే.. భార్యను ATMలా వాడుకునేవాళ్లు చాలా మందే ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు.
ఏదేమైనా మేరీ కోమ్ వంటి దిగ్గజ బాక్సర్ రింగ్‌లో సత్తా చాటినా.. కారణం ఎవరైనా వ్యక్తిగత జీవితంలో ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కోవడం బాధాకరమని ఇంకొందరు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగాలని.. పద్దెమినిదేళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ ఇద్దరు ఇలా రచ్చకెక్కడం ఏమీ బాగాలేదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.


