Manoj Tiwari: సెంచరీ చేశా.. అయినా 14 మ్యాచ్‌లకు పక్కనపెట్టారు.. ఇప్పుడున్న మేనేజ్‌మెంట్‌ గనుక ఉండి ఉంటే!

Manoj Tiwari: Scored 100 Still Got Dropped For Next 14 Matches Mystery - Sakshi

న్యూఢిల్లీ: ‘‘ప్రస్తుత బీసీసీఐ యాజమాన్యం ఆటగాళ్లకు అండగా నిలబడుతోంది. 4-5 మ్యాచ్‌లలో విఫలమైనా మరో అవకాశం కల్పిస్తోంది’’ అని బెంగాల్‌ క్రీడా శాఖా మంత్రి, వెటరన్‌ క్రికెటర్‌ మనోజ్‌ తివారి అన్నారు. తాను టీమిండియాకు ఆడుతున్న సమయంలో గనుక ఇలాంటి మేనేజ్‌మెంట్‌ ఉండి ఉంటే తనను తాను నిరూపించుకునే అవకాశం దక్కేదని అభిప్రాయపడ్డారు.

ఏళ్లపాటు ఎదురుచూసి
కాగా బెంగాల్‌కు చెందిన మనోజ్‌ తివారి మనోజ్‌ తివారి.. భారత్‌ తరఫున 2008లో అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు మొత్తంగా 12 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక 2011 డిసెంబరులో తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు చేసిన మనోజ్‌ తివారి.. ఆ తర్వాతి ఛాన్స్‌ కోసం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.

అజేయ శతకంతో రాణించినా దురదృష్ట వెంటాడంతో జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో శ్రీలంకతో మ్యాచ్‌తో లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ శర్మకు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మనోజ్‌.. నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. 

ఆ విషయంలో నాది ప్రపంచ రికార్డు
ఈ నేపథ్యంలో గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న మనోజ్‌ తివారి తాజాగా స్పోర్ట్స్ తక్‌తో మాట్లాడారు. ‘‘వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాను. కానీ తర్వాత నన్ను జట్టు నుంచి తప్పించారు. 14 మ్యాచ్‌ల పాటు జట్టు దూరమయ్యాను. 

బాగా ఆడినా సరే నన్ను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారో ఇప్పటికీ అంతుపట్టని మిస్టరీ. ఒకవేళ నాకు అవకాశం వస్తే అప్పుడు సెలక్టర్లుగా ఉన్నవాళ్లను కచ్చితంగా నిలదీస్తాను. ఇందులో ఎలాంటి సందేహం లేదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

వాళ్ల వల్లే ఇదంతా
అదే విధంగా.. ‘‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన తర్వాత 14 మ్యాచ్‌లకు దూరమైన ఏకైక ప్లేయర్‌గా నేను ప్రపంచ రికార్డు నెలకొల్పాను. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకున్నాను. రీఎంట్రీలో 65 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీశాను. అయినా, కూడా నా కెరీర్‌ సాఫీగా సాగలేదు.

సరైన అవకాశాలు రాలేదు’’ అని మనోజ్‌ తివారి సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించారు. అయితే, వచ్చిన కొన్ని ఛాన్స్‌ల్లోనే తన ప్రతిభను నిరూపించుకున్నానన్న ఆయన.. తన జీవితంలో జరిగిన ఏ విషయానికి చింతించడం లేదని పేర్కొన్నారు.  కాగా రంజీ ట్రోఫీ సీజన్‌ 2021-2022లో బెంగాల్‌ తరఫున బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు మనోజ్‌ తివారి. సెమీస్‌ మ్యాచ్‌లోనూ సత్తా చాటారు.

చదవండి: Manoj Tiwary On Work And Cricket: పొద్దంతా క్రికెట్‌.. రాత్రిళ్లు నియోజకవర్గం పని

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top