LSG VS GT: కృనాల్‌ పాండ్యా చెత్త రికార్డు.. కెప్టెన్‌ హోదాలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో..!

LSG VS GT: Krunal Pandya Golden Duck Out As Captain In First 2 Matches - Sakshi

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో గోల్డెన్‌ డకౌటైన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. తొలుత సీఎస్‌కేతో రద్దైన మ్యాచ్‌లో (వర్షం కారణంగా) సున్నా పరుగులకే పెవిలియన్‌కు చేరిన కృనాల్‌.. నిన్న (మే 7) తమ్ముడు హార్ధిక్‌ సారధ్యం వహిస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండోసారి తొలి బంతికే డకౌటయ్యాడు. 

కాగా, కేఎల్‌ రాహుల్‌ గాయపడటంతో అనూహ్య పరిణామాల మధ్య కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కృనాల్‌.. సారధిగా తనదైన ముద్ర వేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాడు. పూర్తి స్థాయి కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఫలితం తేలకపోగా.. రెండో మ్యాచ్‌లో తమ్ముడి జట్టు చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాడు. అంతకుముందు రాహుల్‌ గాయపడిన మ్యాచ్‌లోనూ (ఆర్సీబీ) తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన కృనాల్‌.. ఆ మ్యాచ్‌లోనూ తన జట్టును గట్టెక్కించలేకపోయాడు.  

ఇక గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌ విషయానికొస్తే.. లక్నో టీమ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ (51 బంతుల్లో 94 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్‌ సాహా (43 బంతుల్లో 81; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించడంతో గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో లక్నో సైతం ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ప్రారంభించింది.

డి కాక్‌ (41 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), కైల్‌ మేయర్స్‌ (32 బంతుల్లో 48; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెచ్చిపోయి ఆడారు. అయితే 9వ ఓవర్‌లో మేయర్స్‌ ఔట్‌ కావడంతో లక్నో పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఒక్కరు కూడా క్రీజ్‌లో కుదురుకోలేదు. డికాక్‌ సైతం కొంతవరకు పోరాడి చేతులెత్తేశాడు. దీంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

చదవండి: IPL 2023: గిల్‌, సాహా విధ్వంసం.. లక్నోపై గుజరాత్‌ ఘన విజయం

  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top