పంత్‌పై తిట్ల‌ దండకం.. వివరణ ఇచ్చిన గొయెంకా | LSG Owner Sanjiv Goenka Issues Official Statement On Scolding Rishabh Pant | Sakshi
Sakshi News home page

పంత్‌పై తిట్ల‌ దండకం.. వివరణ ఇచ్చిన గొయెంకా

Apr 18 2026 2:34 PM | Updated on Apr 18 2026 2:55 PM

LSG Owner Sanjiv Goenka Issues Official Statement On Scolding Rishabh Pant

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ను ఆ ఫ్రాంచైజీ యజమాని సంజీవ్‌ గొయెంకా తిట్టాడని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై గొయెంకా ఎట్టకేలకు స్పందించారు. తాజాగా ఎన్‌డీటీవీతో మాట్లాడుతూ.. పంత్‌ లాంటి ఆటగాడిని తిట్టే పరిస్థితి ఎప్పుడూ ఉండదని వివరణ​ ఇచ్చాడు. 

నేను ఏది చేసినా వైరలవుతుంది, సోషల్‌మీడియాకు నేనో పంచింగ్‌ బ్యాగ్‌లాగా మారానని అన్నారు. బయట ఎన్ని ప్రచారాలు ఉన్నా, డ్రెస్సింగ్‌ రూమ్‌లో మాత్రం ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. తన హావభావాలు పదేపదే తప్పుగా అర్దమవుతున్నాయి. ఇక నుంచి చేతులు వెనుక పెట్టుకుని మాట్లాడటం నేర్చుకుంటానని హాస్యంగా చెప్పారు.

ఇదే సందర్భంగా ఆటలో తన జోక్యంపై కూడా వివరణ ఇచ్చారు. నేను ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఎప్పుడూ ఆడలేదు. ఆటగాళ్లకు నేను క్రికెట్‌ పాఠాలు నేర్పాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. టెక్నికల్‌ వాళ్లు ఆ పనిని చూసుకుంటారు. నా రోల్‌ జట్టుకు సపోర్ట్‌ చేయడం మాత్రమే. నేను ఆటలో జోక్యం​ చేసుకుంటానన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.  

కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీతో మ్యాచ్‌ పూర్తైన తర్వాత గొయెంకా పంత్‌ను తిట్టాడని సోషల్‌మీడియా కోడై కూసింది. ఆ మ్యాచ్‌లో లక్నో ఓటమి అనంతరం బౌండరీ లైన్‌ వద్ద పంత్‌ను తిడుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. దీనికిపై అప్పుడే లక్నో అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో ఓ వీడియో పోస్ట్‌ చేసి వివరణ ఇచ్చారు. 

అందులో గొయెంకా-పంత్‌ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఈ వీడియోలను నెటిజన్లు నమ్మలేదు. ఫేక్‌ వీడియోలని కొట్టిపారేశారు. గొయెంకాకు కెప్టెన్లను తిట్టిన చరిత్ర ఉంది. గతంలో కేఎల్‌ రాహుల్‌ను కూడా దూషించాడు. ఇప్పుడు పంత్‌ను కూడా తిట్టాడని చర్చించుకున్నారు. తాజాగా గొయెంకా స్వయంగా వివరణ ఇచ్చినా నెటిజన్లు అతని మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు.

ఇదిలా ఉంటే, ప్రస్తుత సీజన్‌లో లక్నో పరిస్థితి హాట్‌ అండ్‌ కోల్డ్‌గా ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టు 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ కూడా పెద్దగా ప్రభావం​ చూపలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్‌ మినహా వ్యక్తిగతంగానూ విఫలమవుతూ వస్తున్నాడు. లక్నో రేపు జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌తో తలపడనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement