ప్రిక్వార్టర్స్‌లో లక్ష్య సేన్, మాళవిక

Korea Open: India Lakshya Sen Makes Winning Start - Sakshi

సన్‌చెయోన్‌ (దక్షిణ కొరియా): భారత నంబర్‌వన్‌ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ కొరియా ఓపెన్‌ వరల్డ్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేశాడు. చోయ్‌ జీ హూన్‌ (దక్షిణ కొరియా)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 14–21, 21–16, 21–18తో గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ మాత్రం తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టాడు.

ప్రపంచ 72వ ర్యాంకర్‌ చీమ్‌ జూన్‌ వె (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ ప్రణయ్‌ 17–21, 7–21తో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో మాళవిక బన్సోద్‌ (భారత్‌) 20–22, 22–20, 21–10తో ప్రపంచ 24వ ర్యాంకర్‌ హాన్‌ వయి (చైనా)పై సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో కృష్ణప్రసాద్‌ గారగ–పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌ (భారత్‌) జోడీ 14–21, 19–21తో ప్రమ్యుద–రామ్‌బితాన్‌ (ఇండోనేసియా) జంట చేతిలో... సుమీత్‌ రెడ్డి–బొక్కా నవనీత్‌ (భారత్‌) ద్వయం 14–21, 12–21తో ఒంగ్‌ యె సిన్‌–తియో ఇ యి (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top