IND Vs ZIM: జింబాబ్వేతో వన్డే సిరీస్‌.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌..!

KL Rahul to lead India on Zimbabwe tour says Reports - Sakshi

ఇంగ్లండ్‌ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా కరేబియన్ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటలో భాగంగా మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లో విండీస్‌తో భారత్‌ తలపడనుంది. ఇక వన్డే సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో ఈ సిరీస్‌లో భారత జట్టు కెప్టెన్‌గా వెటరన్‌ ఓపెరన్‌ శిఖర్‌ ధావన్‌ వ్యవహరించనున్నాడు. అయితే విండీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి, బుమ్రా మినహా మిగతా ఆటగాళ్లంతా తిరిగి జట్టులో చేరనున్నారు.

జూలై 22న పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా జరగనున్న తొలి వన్డేతో భారత టూర్‌ ప్రారభం కానుంది. ఇక విండీస్‌తో వైట్‌బాల్‌ సిరీస్‌ అనంతరం టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా భారత్‌ మూడు వన్డేలు ఆడనుంది.  హరారే వేదికగా ఆగస్ట్ 18న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. అయితే ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్‌ ప్రారంభం కానుండటంతో జింబాబ్వే టూర్‌కు భారత ద్వితీయ శ్రేణి జట్టు వెళ్లే అవకాశం ఉంది.

జింబాబ్వే టూర్‌కు భారత కెప్టెన్‌గా రాహుల్‌
ఆసియా కప్‌ దృష్ట్యా ఈ సిరీస్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో జింబాబ్వే సిరీస్‌కు  భారత జట్టు కెప్టెన్‌గా కెఎల్‌ రాహుల్‌ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.

కాగా గాయం కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న రాహుల్‌ విండీస్‌ టీ20 సిరీస్‌తో తిరిగి జట్టులోకి రానున్నాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్‌ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. విండీస్‌ టీ20 సిరీస్‌కు ముందు రాహుల్‌ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించే అవకాశం ఉంది.
చదవండి: Zimbabwe: టీ20 ప్రపంచకప్‌కు అర్హత.. బిజీ బిజీ షెడ్యూల్‌తో జింబాబ్వే..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top