Tim Seifert: కంటతడి పెట్టిన కివీస్ ప్లేయర్

KKRs Tim Seifert Breaks Down While Narrating His Covid Experience During IPL 2021 - Sakshi

ఆక్లాండ్: భారత్‌లో కోవిడ్ అనుభవాలను గుర్తు చేసుకుంటూ బోరున విలపించాడు కివీస్ డాషింగ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్. ఐపీఎల్ 2021 సీజన్ కోసం భారత్‌కు వచ్చిన ఈ న్యూజిలాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ కరోనా బారిన పడటంతో చాలా రోజుల పాటు ఇండియాలోనే ఉన్నాడు. అయితే ఇటీవలే కరోనా నుంచి కోలుకోవడంతో స్వదేశానికి తిరిగి బయల్దేరాడు. ప్రస్తుతం అక్కడ క్వారంటైన్‌లో ఉన్న సీఫెర్ట్.. కరోనా సోకిన సమయంలో భారత్‌లో తన అనుభవాలను ఆన్‌లైన్ ద్వారా మీడియాతో పంచుకున్నాడు. 

ఈ సందర్బంగా ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ సీఫెర్ట్ బోరున విలపించాడు. కరోనా సోకిందని తెలియగానే గుండె భారంగా మారిందని, అదే సమయంలో భారత్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితుల గురించి తెలుసుకొని ప్రాణాలతో ఇంటికి చేరుతానా..  లేదా..  అన్న సందేహం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. భారత్‌లో ఆక్సిజన్ కొరత, ఆస్పత్రిలో బెడ్ల కొరత తనను కంగారు పెట్టాయని గుర్తు చేసుకున్నాడు. అయితే, సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కేకేఆర్‌ కోచ్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ ధైర్యం చెప్పడంతో కాస్త కుదుట పడ్డానన్నాడు.

కాగా, ఐపీఎల్ 2021 సీజన్‌ కోసం కేకేఆర్ జట్టుకు ఎంపికైన అమెరికా ఆటగాడు అలీ ఖాన్ గాయపడటంతో అతని స్థానంలో సిఫెర్ట్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులోకి వచ్చాడు. అయితే, లీగ్ రద్దు కావడంతో స్వదేశానికి బయల్దేరదామని భావించిన అతనికి షాకింగ్ న్యూస్ తెలిసింది. ఫ్లైట్ ఎక్కే ముందు చేసిన కరోనా టెస్టుల్లో అతనికి పాజిటివ్ గా తేలింది. దీంతో అతన్ని చెన్నైలోని క్వారంటైన్‌ సెంటర్ కు తరలించారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాక ఇటీవలే న్యూజిలాండ్‌కు వెళ్లాడు. ఇదిలా ఉంటే, కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021 సీజన్‌లోని మిగిలిన 31 మ్యాచ్​లను యూఏఈ వేదికగా సెప్టెంబర్​, అక్టోబర్ మధ్య నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. 

చదవండి: వీడియో కాల్లో చూసి కోవిడ్ అని చెప్పేసింది..
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top