
సాక్షి, హైదరాబాద్: గాయంతో ఇబ్బంది పడుతున్న భారత స్టార్ అథ్లెట్ జ్యోతి యర్రాజీ మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో 12.96 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం నెగ్గిన జ్యోతి... ప్రాక్టీస్ సందర్భంగా గాయపడింది. దీంతో పోటీలకు దూరమైన జ్యోతి... తాజాగా యాంటిరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్)కు సర్జరీ చేయించుకున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. ప్రముఖ వైద్యుడు దిన్‌షా పర్దీవాలా పర్యవేక్షణలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపింది.
‘గత కొన్ని వారాలు భారంగా గడిచాయి. గాయం కారణంగా అమితంగా ఇష్టపడే అథ్లెటిక్స్‌కు దూరంగా ఉండాల్సి రావడం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ శుక్రవారం సర్జరీ విజయవంతంగా పూర్తైంది. కష్ట సమయంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, కోచ్‌లు, భారత అథ్లెటిక్స్ సమాఖ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. త్వరలోనే తిరిగి కోలుకుంటా. రెట్టించిన ఉత్సాహంతో ట్రాక్‌పై అడుగుపెట్టాలని భావిస్తున్నా’ అని జ్యోతి పేర్కొంది.
ఇటీవల నిలకడగా రాణిస్తున్న జ్యోతి... టోక్యో వేదికగా జరగనున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలని ఆశించినా... ఇప్పుడది సాధ్యపడేలా లేదు. వరల్డ్ అథ్లెటిక్స్ అర్హత మార్క్ 12.73 సెకన్లు కాగా... జ్యోతి నేరుగా ఈ అవకాశం దక్కించుకోకపోయినా ర్యాంకింగ్స్ ఆధారంగా ఆమెకు ఈ మెగా టోర్నీలో అవకాశం దక్కేది.