12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత విముక్తి | 12 Year Long Urinary Issue Successfully Treated with Surgery | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల మూత్ర సమస్యకు శస్త్రచికిత్సతో శాశ్వత విముక్తి

Jan 13 2026 1:05 PM | Updated on Jan 13 2026 1:13 PM

12 Year Long Urinary Issue Successfully Treated with Surgery

హైదరాబాద్: 12 సంవత్సరాలుగా మూత్ర విసర్జనలో తీవ్ర ఇబ్బందులతో బాధపడుతున్న 45 ఏళ్ల మహిళకు ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించి సాధారణ మూత్ర విసర్జనను పునరుద్ధరించారు. అరుదైన బక్కల్ మ్యూకోసల్ గ్రాఫ్ట్ యూరేత్రోప్లాస్టీ శస్త్రచికిత్స ద్వారా ఆమెకు కొత్త జీవితం అందించారు.

జార్ఖండ్‌కు చెందిన గృహిణి (పేరు మార్చారు – పల్లవి) గత దశాబ్దానికి పైగా మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్ర ప్రవాహం తక్కువగా ఉండటం, మధ్యలో ఆగిపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బాత్‌రూమ్‌లో ఒక్కసారి మూత్ర విసర్జనకు 15–20 నిమిషాల వరకు సమయం పట్టేది. అనేక చోట్ల చికిత్సలు తీసుకున్నా, తాత్కాలిక ఉపశమనం తప్ప సమస్య పూర్తిగా తగ్గలేదు.

ఈ పేషెంట్ కి ఏఐఎన్‌యూ బంజారాహిల్స్‌లోని కన్సల్టెంట్ ఫీమేల్ యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా, రీకన్స్ట్రక్టివ్ యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ భవతేజ్ ఎంగంటి కలిసి శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం నాలుగు నెలల్లో ఆమె మూత్ర ప్రవాహం పూర్తిగా సాధారణ స్థాయికి చేరింది.

డాక్టర్ సారికా పాండ్యా మాట్లాడుతూ, మహిళకు ఫీమేల్ యూరేత్రల్ స్ట్రిక్చర్ అనే మూత్ర సంబంధ సమస్య ఉందని తెలిపారు. మూత్రనాళం సన్నబడటం వల్ల ఈ సమస్య వస్తుందని, దీని లక్షణాలుగా మూత్రం చుక్కలుగా రావడం, మధ్యలో ఆగిపోవడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదన్న భావన, తరచూ ఇన్ఫెక్షన్లు ఉంటాయని వివరించారు.

తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, సిజేరియన్ లేదా గర్భాశయ తొలగింపు వంటి శస్త్రచికిత్సల సమయంలో క్యాథెటర్ వాడకం, సరైన నిర్ధారణ లేకుండా పదేపదే యూరేత్రల్ డైలటేషన్ చేయడం వల్ల ఈ సమస్య ఎక్కువయ్యే అవకాశముందని చెప్పారు.

“యూరేత్రల్ డైలటేషన్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఈ ప్రక్రియ చేయించుకోవడం వల్ల మూత్రనాళం మరింత దెబ్బతిని సమస్య తీవ్రమవుతుంది,” అని డాక్టర్ సారిక తెలిపారు.

పురుషుల్లో చాలాకాలంగా ఉపయోగిస్తున్న బకల్ మ్యూకోసల్  గ్రాఫ్ట్ యూరేత్రోప్లాస్టీని ఇప్పుడు మహిళల్లోనూ విజయవంతంగా చేస్తున్నారు. నోటిలోని లోపలి పొర నుంచి తీసుకున్న కణజాలంతో మూత్రనాళాన్ని పునర్నిర్మించడం ద్వారా దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుందని ఆమె వివరించారు. ఈ శస్త్రచికిత్స వల్ల మూత్ర అదుపు కోల్పోయే ప్రమాదం లేదని కూడా స్పష్టం చేశారు.

గత ఐదేళ్లలో ఏఐఎన్‌యూలో ఈ విధమైన శస్త్రచికిత్సను 60 మంది మహిళలకు నిర్వహించగా, దాదాపు అందరిలోనూ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. మరో పేషెంట్ కి కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాకపోవడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్లు వస్తుండగా, శస్త్రచికిత్స తర్వాత స్పష్టమైన మెరుగుదల కనిపించిందని చెప్పారు.

డాక్టర్ భవతేజ్ ఎంగంటి మాట్లాడుతూ, “మహిళల్లో యూరేత్రల్ స్ట్రిక్చర్  పెద్ద సమస్యగా గుర్తించరు. దీంతో వారు సంవత్సరాల తరబడి బాధపడుతుంటారు. సరైన సమయంలో నిర్ధారణ చేసి ఆధునిక శస్త్రచికిత్స చేయిస్తే, ఎంతకాలంగా ఉన్న సమస్యనైనా సమర్థంగా నయం చేయవచ్చు  అన్నారు.

మూత్ర విసర్జనకు ఎక్కువ సమయం పట్టడం, మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండటం, మధ్యలో ఆగిపోవడం, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రావడం వంటి లక్షణాలు ఉన్న మహిళలు తప్పనిసరిగా నిపుణ వైద్యులను సంప్రదించాలని డాక్టర్ సారిక సూచించారు. ఈ సమస్య ఎక్కువగా 40 ఏళ్లకు పైబడిన మహిళల్లో కనిపిస్తుందని, మూత్ర సంబంధిత సమస్యలతో వచ్చే మహిళల్లో 10–20 శాతం మందిలో ఇది ఉండొచ్చని తెలిపారు. 

మహిళల్లో మూత్ర సమస్యలు కేవలం వైద్య పరమైన సమస్యలే కాకుండా సామాజిక, భావోద్వేగ భారం కూడా అవుతాయని వైద్యులు పేర్కొన్నారు. మూత్ర విసర్జన ఇబ్బందులపై మాట్లాడటాన్ని చాలామంది మహిళలు ఇబ్బందిగా భావిస్తారని, ఇదే సమస్య తీవ్రత పెరగడానికి కారణమవుతోందని అన్నారు. అవగాహన, సమయానుకూల చికిత్స ద్వారా ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యమని వారు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement