నా వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు. నాకు మళ్లీ మళ్లీ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. డాక్టర్ మందులు ఇస్తే తగ్గుతుంది. కాని, కొంతకాలానికి మళ్లీ వస్తుంది. ఈ మధ్య దగ్గు వచ్చినప్పుడు లేదా బలంగా నవ్వినప్పుడు మూత్రం లీక్ అవుతున్నట్టు అనిపిస్తోంది. దీనికి కారణం ఏమిటి? సరైన పరీక్షలు, చికిత్స ఏమిటో చెప్పండి.
– రాధ, అనంతపురం.
మీకు తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని, ప్రతిసారి ఒకే రకమైన మందులు వాడితే శరీరానికి అవి అలవాటు పడిపోయే అవకాశం ఉంటుంది. దాంతో మందులు తక్కువగా పనిచేయడం, ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సారి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తోంది అనే కారణాన్ని తెలుసుకోవడం చాలా అవసరం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. నీరు తక్కువగా తాగడం, మలబద్ధకం, దగ్గు ఎక్కువగా ఉండడం, మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోవడం ఇవన్నీ సమస్యను పెంచుతాయి. రోజూ సరిపడా నీరు తాగాలి. మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవడం మంచిది. మసాలా, కారం ఎక్కువగా ఉన్న ఆహారం, చల్లని పానీయాలు, టీ, కాఫీ తగ్గించాలి. మలబద్ధకం, దగ్గు ఉంటే వాటికి కూడా చికిత్స తీసుకోవాలి.
దగ్గు లేదా నవ్వినప్పుడు మూత్రం లీక్ అవడం అనేది మూత్రాశయ కండరాల బలహీనత వల్ల కావచ్చు. దీనివల్ల మూత్రాశయం, మూత్రనాళం సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ద్వారా మూత్రాశయంలో ఒత్తిడి ఎలా ఉంది, కండరాల పని తీరు ఎలా ఉంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షను సాధారణంగా బయట చికిత్స విభాగంలోనే చేస్తారు. పెద్ద నొప్పి ఉండదు, అవసరమైతే మత్తు మందుతో చేస్తారు. అదే రోజు ఇంటికి వెళ్లొచ్చు. అయితే, ఈ పరీక్ష చేయడానికి ముందు ప్రస్తుతం ఇన్ఫెక్షన్ లేదని నిర్ధారించాలి.
ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ముందుగా దానికి మందులు ఇవ్వాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా కండరాల వ్యాయామాలు, మందులు లేదా ఇతర చికిత్స అవసరమా అనే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి, మూత్రం లీక్ అవుతోంది అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుణ్ని సంప్రదించి, అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలా చేస్తే సమస్యకు సరైన చికిత్స తీసుకుని, సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు.
నా వయస్సు నలభై ఎనిమిది సంవత్సరాలు. గర్భసంచి గడ్డల కారణంగా గర్భసంచి తీసివేయాలని డాక్టరు చెప్పారు. కాని, అండాశయాలను మాత్రం తీసివేయొద్దు అని అంటున్నారు. అండాశయాలు తీసివేస్తే బరువు పెరుగుతుందని కూడా చెప్పారు. ఇందులో సరైన నిర్ణయం ఏంటి?
– లలిత, శ్రీకాకుళం.
గర్భసంచి గడ్డల వల్ల శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు అండాశయాలను తీసివేయాలా లేక ఉంచాలా అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది ప్రతి మహిళలో ఒకేలా ఉండదు. మీ వయస్సు, సమస్య స్వభావం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర, స్కాన్ నివేదికలు ఇవన్నీ చూసి వైద్యులు నిర్ణయం తీసుకుంటారు. క్యాన్సర్ అనుమానం ఉన్నప్పుడు, లేదా భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పుడు, సాధారణంగా అండాశయాలను కూడా తీసివేయాలని సూచిస్తారు. అలా చేస్తే భవిష్యత్తులో మళ్లీ ఆపరేషన్ అవసరం లేకుండా ఉంటుంది. కానీ క్యాన్సర్ ప్రమాదం లేని పరిస్థితుల్లో, అండాశయాలను ఉంచితే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. అండాశయాలు ఉంచితే శరీరంలో సహజ హార్మోన్లు ఉత్పత్తి అవుతూనే ఉంటాయి.
దీని వల్ల ఒక్కసారిగా వేడి దడలు, ఎక్కువ చెమటలు, మూడ్ మార్పులు, డిప్రెషన్ , జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం కూడా కొంతవరకు తగ్గుతుంది. అండాశయాలు తీసివేస్తే నెలసరి ఆగిపోయిన తర్వాత వచ్చే లక్షణాలు ముందుగానే వస్తాయి. వేడి దడలు, నిద్రలేమి, తలనొప్పులు, ఎముకల నొప్పులు, ఎముకలు పలుచబడటం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొందరిలో బరువు పెరగడం కూడా జరుగుతుంది. అయితే ఇది ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా జరుగుతుందనే కాదు. కొన్ని ఎంపిక చేసిన పరిస్థితుల్లో హార్మోన్ ప్రత్యామ్నాయ చికిత్స ఇవ్వడం ద్వారా ఈ సమస్యలను తగ్గించవచ్చు.
మాత్రలు లేదా ప్యాచ్‌ల రూపంలో ఈ చికిత్స ఇస్తారు. అయితే ఇది అందరికీ సరిపోదు. వైద్యుడు పూర్తిగా పరిశీలించిన తర్వాతే సూచిస్తారు. కొన్ని అరుదైన సందర్భాల్లో అండాశయాలు ఉంచినా, తరువాత పొత్తికడుపు నొప్పి లేదా ఇతర సమస్యల వల్ల మళ్లీ శస్త్రచికిత్స అవసరం రావచ్చు. అలాగే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు అండాశయాలు ఉంచడం వల్ల నొప్పి కొనసాగవచ్చు. కాబట్టి గర్భసంచి శస్త్రచికిత్స సమయంలో అండాశయాలు తీసివేయాలా వద్దా అన్న నిర్ణయం మీ వైద్యునితో పూర్తిగా చర్చించి తీసుకోవాలి. మీకు ఉన్న సమస్య, భవిష్యత్తు ప్రమాదాలు, లాభనష్టాలు అన్నీ తెలుసుకుని నిర్ణయం తీసుకుంటేనే దీర్ఘకాలంలో మేలు జరుగుతుంది.



